Blastings : సిమెంట్ పరిశ్రమ వస్తే తమ గ్రామాలు బాగుపడతాయని అక్కడ ప్రజలు ఆశపడ్డారు. ఇప్పుడు అదే పరిశ్రమ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమకు సంబంధించి క్వారీలో రోజూ మధ్యాహ్నం బ్లాస్టింగ్ చేయడం వల్ల సమీప గ్రామాలైనా.. దుగ్గనపల్లి, నవాబుపేట గ్రామాల ప్రజల ఒళ్లు, ఇళ్లు, పొలాలు గుల్లవుతున్నాయి. కొద్దిరోజులుగా.. తూర్పు నుంచి పడమర గాలి వీచడంతో ఆ దుమ్మంతా పొలాలపై పడి దిగుబడిపై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో ఓ సిమెంటు పరిశ్రమ వల్ల పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దుగ్గనపల్లె, నవాబుపేట ప్రజలకు దిన దిన గండంలా మారింది. సిమెంట్ తయారీకి వాడే సున్నపురాయి కోసం సుమారు 2000 కిలోమీటర్ల పరిధిలో ఆ పరిశ్రమ యాజమాన్యం భూములను కొనుగోలు చేసింది. వాటి పక్కనే గ్రామాలు ఉండటం వల్ల ప్రతిరోజూ జరిగే బ్లాస్టింగ్ తో ఇళ్లకు పగుళ్లు ఏర్పడి... నెర్రెలు చీలాయి. భయంతో కొంతమంది ఇళ్లను విడిచి వెళ్లిపోగా, మరికొంతమంది తప్పని పరిస్థితిలో ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం పరిశ్రమ యాజమాన్యానికి తెలిసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నెల నుంచి మరో సమస్య వచ్చి పడింది. తూర్పు నుంచి పడమర వైపునకు గాలివీచడం వల్ల ఫ్యాక్టరీకి సంబంధించిన దుమ్ము, ధూళి పంటలను కప్పేస్తోంది. అలా జరగడంతో దిగుబడిపై ప్రభావం చూపుతోందని బాధిత రైతులు వాపోతున్నారు. పత్తి, మిరప తదితర పంటలు నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ఎండుమిర్చి మాత్రమే 250 ఎకరాలకు పైగా ఉందని.. ఫ్యాక్టరీ దుమ్ము కారణంగా సగం సగం దిగుబడి కోల్పోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్లు పడిపోతున్నాయి.. ఆ భయానికి పిల్లలతో కలిసి ఇళ్లు వదిలి బయట ఉంటున్నం.. చలికి వణికిపోతున్నం. దాల్మియా వల్ల ఇళ్లు చీలిపోతున్నాయి. - దానమ్మ, బాధితురాలు, దుగ్గనపల్లి, మైలవరం మండలం
దాల్మియా పరిశ్రమ క్వారీలో రాయి పేలుళ్ల శబ్దానికి గోడలు చీలుతున్నాయి. దుమ్మంతా ఇళ్లలోకి వస్తుంది. వానొస్తే ఇళ్లు కురుస్తున్నాయి. అయినా మాకు ఎటువంటి పరిష్కారం చూపించడం లేదు. - శాంతకుమారి, బాధితురాలు, దుగ్గనపల్లి, మైలవరం మండలం