కడప జిల్లాలో జల ప్రళయం కోలుకోలేని గాయం చేసింది. సుండుపల్లి మండలం పింఛ, రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద ఉన్న అన్నమయ్య జలాశయం మట్టి కట్టలు శుక్రవారం తెగిపోవడంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చెయ్యేరు నదికి పక్కనే ఉన్న పులపుత్తూరు, పులపుత్తూరు ఎస్సీ కాలనీ, కోనరాజుపల్లె, దిగువ, ఎగువ మందపల్లి, శేషమాంబపురం, తోగూరుపేట, గండ్లూరు, చొప్పావారిపల్లె గ్రామాలు ఎక్కువగా నష్టపోయాయి. పాటూరు, ఇసుకపల్లి, నీలిపల్లి, నాగిరెడ్డిపల్లె, నందలూరు, కుమ్మరపల్లి, గొల్లపల్లి, తురకపల్లిలోనూ వర్షపు నీరు ముంచేసింది. ఉదయం 6.30-8.30 గంటల్లోపు వరద బీభత్సం సృష్టించింది. రెండు గంటల్లోనే ఎక్కడికక్కడే ఇళ్లు కూలిపోయాయి. బాహుదా నది పరివాహక గ్రామాల్లోని ప్రతి ఇంట్లోకి 8-10 అడుగుల మేర నీరు చేరింది. వరద వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు ముందస్తు సమాచారమివ్వలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నష్టం జరిగినా ఎవరూ పలకరించలేదని పేర్కొన్నారు.
ప్రాణాలతో బయటపడ్డాం
ఉప్పెన వచ్చి నిండా ముంచేసింది. ప్రాణాలతో బయటపడ్డాం. రూ.30 లక్షలతో నిర్మించుకున్న ఇల్లు పూర్తిగా కుంగిపోయింది. ఒక్క వస్తువు మిగలలేదు.
- తిరుమలశెట్టి వెంకటసుబ్బమ్మ, ఎగువ మందపల్లి
ఇలాంటి ఉపద్రవం చూడలేదు
ఇంటిపై నుంచి నీటి ప్రవాహం సవ్వడికి భయపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశాం. నాకిప్పుడు 64 ఏళ్లు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఉపద్రవం చూడలేదు.
-ఎల్లటూరు సుబ్బరాజు, దిగువ మందపల్లి
బిడ్డ పెళ్లికి తెచ్చిన నగలు వరదార్పణం