People Demanding to Build Bridges in Kadapa:కడప నగరంలో బుగ్గవంక ప్రవహిస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం తక్కువే అయినప్పటికీ.. భారీస్థాయి వర్షాలకు.. వరద నీరు నగరంలోకి ప్రవేశిస్తుంది. బుగ్గవంక ప్రాజెక్టు చుట్టూ ఉన్న నాగరాజుపేట, రవీంద్ర నగర్, మురారియా నగర్, తారకరామ నగర్, గుర్రాలగడ్డ ప్రాంతాలు నీటమునిగేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బుగ్గవంక రెండువైపులా.. కోట్లు వెచ్చించి రక్షణ గోడ ఏర్పాటు చేశారు. దీంతో సమస్య తీరిందనుకునే లోపే మరో సమస్య వచ్చి పడింది.
రక్షణ గోడ నిర్మాణంలో భాగంగా బుగ్గవంక పై నాగరాజు పేట, గుర్రాల గడ్డ వద్ద ఏళ్ల తరబడి ఉన్న చిన్నపాటి వంతెనల్ని అధికారులు తొలిగించారు. దీంతో రవీంద్ర నగర్, మురారియా నగర్, మరియాపురం, అక్కయ్య పల్లి, చౌటుపల్లి ప్రాంత ప్రజలు నగరంలోకి రాకపోకలు సాగించాలంటే.. తీవ్ర ఆటంకం ఏర్పడింది. పాత బస్టాండ్, కాగితాల పెంట హై లెవెల్ వంతెన మీదుగా.. చుట్టూ తిరిగి నగరానికి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సమయం వృథా కావడంతో పాటు.. అధిక మొత్తంలో ఛార్జీలకు వెచ్చించాల్సి వస్తోందని విద్యార్థులు, రోజువారీ కూలీలు చెబుతున్నారు.
ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని.. రాకపోకలు సాగించేందుకు వంతెనలు నిర్మించాలని అధికారుల్ని వేడుకున్నా.. పట్టించుకోవడం లేదని ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ గోడ నిర్మాణ సమయంలో వంతెనల తొలగింపును.. స్థానికులు ప్రశ్నించారు. పాత వంతెనల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిని నిర్మించి.. వంతెనలకు ఇరువైపుల సుందరీకరణ పనులు కూడా చేపడతామని ఆ సమయంలో నగరపాలక అధికారులు సెలవిచ్చారు.
కానీ.. ఆ వాగ్దానాలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. చేసేదేమీ లేక ఆ ప్రాంత ప్రజలు ప్రమాదమైనప్పటికీ.. డ్రైనేజీ గొట్టాల నుంచే ప్రయాణించాల్సి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు బస్టాండ్ సమీపంలో రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉండటంతో స్ర్తీలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులకు రక్షణ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సొంత జిల్లాల్లోని ప్రజలే.. రాకపోకలకు అవస్థలు పడాల్సిన దుస్థితి వచ్చిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.