Tummalapalle Uranium Mine: తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ వాతావరణాన్ని విషతుల్యం చేస్తోందంటూ ఆగమేఘాలపై మూసివేత ఉత్తర్వులిచ్చింది జగన్ ప్రభుత్వం. కానీ, పులివెందుల నియోజకవర్గ ప్రజల కాలుష్యవేదన మాత్రం అరణ్య రోదనగానే మిగిలింది. వైఎస్సార్ జిల్లా ఎమ్ తుమ్మలపల్లెలోని యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు నిల్వచేసే చెరువులోని కాలుష్యకారకాలు భూగర్భంలోకి ఇంకడం వల్ల.. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని స్థానిక ప్రజలు అనేకసార్లు ఆందోళనలు చేశారు. చర్మవ్యాధులు చుట్టుముడుతున్నాయని, కీళ్ల నొప్పులు, గర్భ విచ్ఛిత్తి వంటి సమస్యలతో సతమతం అవుతున్నామని ఆందోళనచెందుతున్నారు.
ప్రజల ఫిర్యాదులతో కాలుష్య నియంత్రణ మండలి మద్రాసు ఐఐటీతో అధ్యయనం చేయించింది. యూరేనియం వ్యర్థాలను చెరువులో నిల్వచేయటం వల్ల భూగర్భ జలకాలుష్యం జరిగిందనటానికి ఎలాంటి రుజువు లేదని ఆ నివేదిక తేల్చేసింది. ఐతే.. ఆ నివేదికలో శాస్త్రీయత లేదని, అధ్యయనానికి వారు అనుసరించిన పద్ధతి శాస్త్రీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని మానవహక్కుల వేదిక మండిపడింది. మద్రాసు ఐఐటీ నివేదికలోని అంశాలపై ఐదుగురు శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపించి.. అందులోని డొల్లతనాన్ని బహిర్గతపరిచారు శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి బాబూరావు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాలుష్య నియంత్రణా మండలి కూడా యురేనియం కర్మగారానికి అనుకూలంగా వ్యవహరించి.. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టాయని.. బాబూరావు ఆరోపించారు.
"సరైన అధ్యయనం చేయకుండా, ప్రజల కష్టాలను గమనించకుండా.. అసలు చెరువు నుంచి వ్యర్థాలు భూమిలోనే ఇంకటం లేదని నివేదిక ఇచ్చారు. అక్కడి నుంచి ఏమి ఇంకటం లేదని చెప్పటంలోనే ఐఐటీ మద్రాసు తప్పు ఉంది."-బాబూరావు, శాస్త్రవేత్త