కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం నుంచి వెలువడే విష వాయువులను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిలపక్ష సభ్యులు అన్నారు. కడప డీసీసీబీ కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యురేనియం అనర్థాలకు వ్యతిరేకంగా ఇవాళ అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యురేనియం బాధిత గ్రామాల ప్రజలతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నామమాత్రంగానే బాధిత గ్రామాల్లో పర్యటించిందని ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విశాఖలోని బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మలపల్లిలో కూడా నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఈమేరకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలని సూచించింది.
ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు
అభివృద్ధి జరుగుతుందని పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించినందుకు విషతుల్యమైన కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామని బాధిత గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం కర్మాగారానికి వ్యతిరేకంగా మాట్లాడితే స్థానికంగా గ్రామస్థులకు రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. కాగా తుమ్మలపల్లి యురేనియం బాధిత ఏడు గ్రామాలకు చిత్రావతి నుంచి పైపు లైను ద్వారా మంచినీటిని తీసుకురావాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రెండు రోజుల కిందట పచ్చజెండా ఊపినట్లు సమాచారం.