గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాపాగ్ని నది పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో.. కడప జిల్లా కమలాపురం వద్ద నదిపై నిర్మించిన పురాతన వంతెన (Papagni river Bridge damage) దెబ్బతింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వంతెన కుంగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కమలాపురం ఎస్సై.. వంతెన వద్దకు చేరుకొని వాహన రాకపోకలను నిలిపేశారు. బ్రిడ్జి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి, అటువైవు ఎవరూ వెళ్లకుండా గస్తీ ఏర్పాటు చేశారు.
వాహనాల దారి మళ్లింపు..
నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసినట్లు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి స్పష్టం చేశారు. కడప నుంచి కమలాపురం వైపు వెళ్లాల్సిన వాహనాలను ఇర్కాన్ సర్కిల్ వద్ద దారిమళ్లించినట్టు చెప్పారు. అనంతపురం, తాడిపత్రి వెళ్లాల్సిన వారు.. మైదుకూరు, ప్రొద్దుటూరు లేదా పులివెందుల మీదుగా వెళ్లాలని సూచించారు. కమలాపురం, ఎర్రగుంట్ల నుంచి కడప వైపు వెళ్లే వాహనాలు ప్రొద్దుటూరు లేదా పులివెందుల మీదుగా కడపు చేరుకోవాలన్నారు. కడప నుంచి ఎర్రగుంట్ల వెళ్లాల్సిన వారు మైదుకూరు మీదుగా వెళ్లాలని సూచించారు.