ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్టీలను వేధిస్తున్న వర్గ పోరు.. రెబల్స్​కు నేతల బుజ్జగింపులు - కడప జిల్లాలో వేధిస్తున్న వర్గ పోరు వార్తలు

కడప జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో వైకాపాలో వర్గపోరు బయటపడుతోంది. ఏపీ‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం గ్రామపంచాయతీలకు జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉండడంతో ఈ సారి ఎలాగైనా సర్పంచి పదవికి పోటీ చేయాలని చాలామంది ఆరాటపడుతున్నారు. ఒక వేళ పార్టీ నాయకులు అంగీకరించకపోతే రెబల్‌గా బరిలోకి దిగడానికి వెనుకాడడంలేదు. జిల్లాలో చాలా గ్రామపంచాయతీల్లో సర్పంచి స్థానానికి వైకాపా తరఫున ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఈ కారణంగా కొన్ని చోట్ల ఇతర రాజకీయ పార్టీల మద్దతుదారులకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని అరికట్టడం వైకాపా ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారుతోంది. దీంతో తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

panchayati elections rebel candidates
రెబల్స్​లకు నేతల బుజ్జగింపులు

By

Published : Jan 30, 2021, 4:41 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 14 గ్రామ పంచాయతీల్లో పార్టీ తరఫున ఒకే అభ్యర్థిని ఎంపిక చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి కొత్తపల్లె పంచాయతీ విషయంలో ఏర్పడిన చిక్కు విప్పలేకపోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామపంచాయతీలో సర్పంచి స్థానానికి ఎమ్మెల్యే అనుచరుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. అదే పార్టీ మద్దతుదారుడిగా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కోడలు మల్లెల ఉమ శనివారం నామపత్రం దాఖలు చేయనున్నారు.

రాజుపాళెం మండలం పైడాల, అరకటవేముల, టంగుటూరు గ్రామపంచాయతీల్లో సర్పంచి స్థానానికి వైకాపా తరఫున ఇద్దరేసి చొప్పున మద్దతుదారులు బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో కొన్నిచోట్ల స్థానిక నాయకులు రాజీ చేయాలని భావిస్తున్నారు. ఎల్లవల్లిలో తెదేపా తరఫున ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కలసపాడు మండలం శంకవరం, రాజుపాళెం, పెండ్లిమర్రి గ్రామపంచాయతీల్లో సర్పంచి స్థానానికి వైకాపాకు మద్దతుగా ఉన్న రెండు వర్గాలు పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. రాజుపాళెం పంచాయతీలో వైకాపాలో ఏర్పడిన తిరుగుబాటును సొమ్ము చేసుకునేందుకు స్థానిక తెదేపా నాయకులు పావులు కదుపుతున్నారు. తంబళ్లపల్లె, మహానందిపల్లె, చింతలపల్లెలో తెదేపాకు స్థానిక నాయకులు బలంగా ఉండడంతో గట్టి పోటీ ఇవ్వనుంది. మండలంలో కొన్ని చోట్ల తెదేపా నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రంగంలోకి దిగారు. ఆమె శుక్రవారం కలసపాడులో తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

కాశినాయన మండలంలో వైకాపా తరఫున గొంటువారిపల్లె, గంగనపల్లె గ్రామపంచాయతీల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలవడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు మహిళ కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, ఆమె భర్త వెంకటరెడ్డి సొంత మండలం కావడంతో నరసాపురం, ఆకులనారాయణపల్లె, రంపాడులో తెదేపా మద్దతుదారుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. బద్వేలు నియోజకవర్గంలోని చిన్నఎరసాల గ్రామపంచాయతీలో వైకాపా తరఫున సర్పంచి స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు.

ఏకగ్రీవానికి ఒప్పందాలు...

నామినేషన్ల ప్రక్రియ పూర్తికాకముందే పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు జోరుగా చర్చలు సాగుతున్నాయి. గతంలో జరిగిన ఒప్పందం మేరకు అట్లూరు మండలం కామ సముద్రం సర్పంచి స్థానాన్ని తెదేపా మద్దతుదారుడికి ఏకగ్రీవం చేయనున్నారు. ఇందుకు బదులుగా 80 మంది తెదేపా కార్యకర్తలు శుక్రవారం పోరుమామిళ్లలో వైకాపా కండువా కప్పుకున్నారు. బి.కోడూరు మండలం రామసముద్రం, మేకవారిపల్లె, పాయలకుంట్ల సర్పంచి స్థానానికి వైకాపా తరఫున ఇద్దరేసి చొప్పున అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఏకగ్రీవమైతే చెరో రెండున్నరేళ్లు పదవిలో ఉండేట్లుగా సయోధ్య చేసుకుంటున్నారు. గోపవరం మండలంలో ఆదర్శ గ్రామం కాలువపల్లెలో ఏకగ్రీవం దిశగా జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: వైఎస్​ఆర్​కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details