ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని పురపాలక సభా భవనంలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వివిధ శాఖల అధికారులు ఈ భేటిలో పాల్గొన్నారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. టీకాలు వేయడంలో కడప జిల్లా ముందు స్థానంలో ఉందని అన్నారు
ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ఏపీఎండీసీ ద్వారా రెండు కోట్లు, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి తన సొంత నిధులు 50 లక్షల రూపాయలను ఇచ్చారని.. వాటితో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉందని ఇందులో భాగంగా మూడు నియోజకవర్గాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.