Onion Farmers Problems: వైఎస్సార్ జిల్లా కమలాపురం, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల, ఖాజీపేట, మైదుకూరు మండలాల్లో అత్యధికంగా ఉల్లిపంట సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో ఉల్లి పంట వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క వి.ఎన్.పల్లి మండలంలోనే 3 వేల ఎకరాల్లో ఉల్లి పండించారు. పంట చేతికొచ్చే సమయంలో ఇటీవల కురిసిన వర్షాలు... రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పంటంతా పొలంలోనే కుళ్లిపోయింది. గడ్డలు ఊరకుండా నల్లగా, సన్నగా మారి వాడుకోవడానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయని రైతులు నిట్టూరుస్తున్నారు.
"మూడెకరాల్లో ఉల్లిపంట వేశాను. వర్షాల వల్ల నాకు రెండున్నర లక్షల నష్టం వచ్చింది. అంతా నష్టమే. అన్ని పారబోశాం. వర్షాలొచ్చి, రోగాలొచ్చి అన్నింటి వల్ల ఇబ్బందే. ప్రభుత్వం అసలూ పట్టించుకోవడం లేదు. రైతులు విషం తాగి సావాల్సిందే." -ఉల్లి రైతు
"ఈ అకాల వర్షాల వల్ల మొత్తం కుల్లిపోయింది. రూపాయి వచ్చేదంటూ లేదు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదు. రైతు భరోసా అని కుటుంబానికి ఆరేడు వేలు ఇస్తున్నారు. అవి బిచ్చగానికి ఇచ్చినట్లు ఇస్తున్నారు. అది ఏమూలకు సరిపోదు. రానురాను క్రాప్ హాలిడే ప్రకటించాల్సివస్తుంది. కాబట్టి రైతులకు ఆత్మహత్యలే తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా విజ్ఞప్తిని ఆలకించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. -ఉల్లి రైతు