కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది. కర్ణాటక నుంచి నెల్లూరు వెళ్తున్న కారులో కోటి రూపాయలకు పైగానే నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి బిల్లులు లేకుండా కారులో ఇద్దరు వ్యక్తులు నగదు తీసుకువెళ్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. సొమ్మును స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు.
కర్ణాటకలో వక్కల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బు వసూలు చేసుకుని నెల్లూరులో గ్రానైట్ కొనుగోలు కోసం తీసుకెళ్తున్నట్లు కారులో ఉన్న వారు చెబుతున్నారు. అయితే అది ఎంతవరకు వాస్తవం అనే దానిపై విచారణ చేస్తున్నామని అదనపు ఎస్పీ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణకు సంబంధించి జిల్లా సరిహద్దుల్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడిందని ఆయన తెలిపారు.