కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కడపలో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జేసీ సాయికాంత్ వర్మ .. రోగులతో నేరుగా మాట్లాడారు. బాధితుల నుంచి లక్ష రూపాయల డిపాజిట్ చేయించుకుని, మందుల కోసం అదనంగా మరో రూ.55 వేలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. జేసీ ఆ వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. స్పందించిన కలెక్టర్ రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఆరోగ్యశ్రీలో అడ్మిట్ పొందిన రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే 2005 చట్టం ప్రకారం సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో అనుమతి పొందిన ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు, నాన్-ఆరోగ్యశ్రీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవల తీరుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు నేరుగా దృష్టి సారించారు.