ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్రమణలకు గురై'నది'! - ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో కబ్జా

కడప జిల్లా సుండుపల్లిలో నదీ పరివాహక భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రభుత్వ దస్త్రాల్లో నదికి సంబంధించిందిగా ఉన్న భూమిలో కొంత భాగాన్ని ప్రస్తుతం యంత్రాలతో చదును చేస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముసుగులో నదీతీర ప్రాంతాన్ని స్థిరాస్తి వ్యాపారానికి అనువుగా మార్చుకునేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

Occupied For aggression at kadapa district
ఆక్రమణలకు గురైనది!

By

Published : Oct 20, 2020, 6:55 PM IST

కడప జిల్లా సుండుపల్లిలో నదీ పరివాహక భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రభుత్వ దస్త్రాల్లో నదికి సంబంధించిందిగా ఉన్న భూమిలో కొంత భాగాన్ని ప్రస్తుతం యంత్రాలతో చదును చేస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముసుగులో నదీతీర ప్రాంతాన్ని స్థిరాస్తి వ్యాపారానికి అనువుగా మార్చుకునేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే నదీ పరివాహక భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది.

గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మొదటగా ఈ ఏడాది ఉగాది రోజున నిర్వహించాలని భావించినా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. అనంతరం న్యాయపరమైన చిక్కులతో వాయిదా పడుతూ వస్తోంది. సుండుపల్లె మండల కేంద్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కప్పలకుంట, కేజీబీవీ పాఠశాల ఎదురుగా, చీకటిపల్లె తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి ప్లాట్లు వేసి లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు.

అయితే అర్హుల సంఖ్య అధికంగా ఉండడంతో మరొక చోట భూములను సేకరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సుండుపల్లి-పీలేరు రహదారి పక్కన ఉండే అగ్రహారం గుట్ట సమీపంలో కొంత స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఇందులో గుట్టతోపాటు రహదారి, కాలువలకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని చదును చేసేందుకు గృహనిర్మాణశాఖ రూ.15 లక్షలు మంజూరు చేసింది.

అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లోనే??

సుండుపల్లిలోని 2431 సర్వే నెంబరులో బాహుదా నదికి చెందిన 33.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రభుత్వ అడంగల్‌లో పేర్కొన్నారు. ఇక్కడ గత కొంత కాలంగా కొంతమంది రైతులు అనధికారికంగా పంటలు సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భూములకు సమీపంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తుండడంతో వీటిపై కబ్జాదారుల కన్ను పడింది. అక్కడ అనధికారికంగా సాగుచేస్తున్న రైతులతో మండలంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నాయకుడు మౌఖిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొందరు నదీ పరివాహక భూముల్లో మట్టిని నింపి చదును చేస్తున్నారు.

తాము గత కొన్నేళ్లుగా సాగుచేసుకుంటున్న భూముల్లో చదును చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా చదును పనులు నిర్వహించారు. ఇక్కడ ఎకరా పట్టా భూమి విలువ సుమారు రూ.కోటికిపైగా ఉంటుంది. ఈ లెక్కన సుమారు రూ.4 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో అధికార పార్టీ కీలక నాయకుడి కనుసన్నల్లోనే నదీ పరివాహక భూముల ఆక్రమణలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

సుండుపల్లిలోని 2431 సర్వే నెంబరులో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. - కనకదుర్గయ్య,తహసీల్దారు, సుండుపల్లి మండలం

ఇదీ చదవండి:

విపత్తుల్లో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details