కడప జిల్లాలో జనవరి 28వ తేదీన సచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. వీటిలో కొత్తగా నియమితులైన ఉద్యోగులు వివిధ విభాగాల్లో కొలువుదీరారు. ప్రతి సచివాలయంలో ప్రజా సేవలతోపాటు స్పందన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాల ద్వారా అందించనున్న 530 రకాల సేవలను స్థానికులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. లభ్యమవుతున్న సేవలను అవసరార్థులు వినియోగించుకునే క్రమంలో సచివాలయాలకు వెళ్లి తమకు ఫలానా ధ్రువపత్రం కావాలని అడిగితే దీనికి సంబంధించిన లాగిన్, తదితరాలు తమకు ఇంకా తెలియవంటూ సిబ్బంది చెబుతున్నారు.
చాలామందికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏయే ఫిర్యాదులు తీసుకుంటారు, ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై అవగాహన లేదు. ఫలితంగా చాలామంది నేటికీ మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు. పైగా గ్రామంలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో లేదోననే అనుమానంతో పట్టణాల్లోని మీసేవ కేంద్రాలకు వెళుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.
జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 530 రకాల సేవలను నామమాత్రపు రుసుముతో ప్రజలు పొందవచ్చు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 83, రవాణా 61, పురపాలక శాఖకు సంబంధించి 39 సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు 80 శాతం మంది పట్టణాల్లోని మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన 45 నుంచి 60 సంవత్సరాల వయస్సుగల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏటా రూ.18,700 నగదును అందిస్తామని ప్రకటించింది. దీంతో అనేకమంది మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో చాలామంది స్థానిక సచివాలయాలకు వెళ్లి కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసేందుకు యత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో చివరికి మీసేవ కేంద్రాలకు వెళుతున్నారు.
నకళ్లకు ఇబ్బంది..
బద్వేలు మండల పరిధిలోని బేతాయపల్లెలో సచివాలయం ఏర్పాటైంది. ఇందులో వివిధ అవసరాలకు దరఖాస్తు చేసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కాకులూరి లక్ష్మీదేవి అనే మహిళ తెలిపారు. ముఖ్యంగా సంబంధిత పత్రాల నకళ్లు చేయించుకోవటం కుదరటం లేదన్నారు. అందువల్ల పట్టణానికి పనిపై వెళ్లేటప్పుడు అక్కడే ఉన్న మీసేవ కేంద్రాల్లో ఆదాయ, కుల ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సేవలు పెంచితే మేలు..
గోపవరం మండలంలో మారుమూల సూరేపల్లి. కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం సచివాలయానికి వెళితే అంతర్జాలం పని చేయలేదని మరో మహిళ చెప్పారు. దీంతో పట్టణంలోని మీ-సేవ కేంద్రంలో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. సచివాలయాల్లోనే సేవలను అందిస్తే మేలని అభిప్రాయపడుతున్నారు.