కడప కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 5 డివిజన్లకు ఒక్కో కార్యాలయాన్ని కేటాయించి అక్కడ 5 డివిజన్లకు సంబంధించి అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేస్తున్నారు. పత్రాలు దాఖలు చేసేందుకు రేపు చివరి రోజు కావటంతో చాలా మంది ఈరోజు నామ పత్రాలు దాఖలు చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థుల నామ పత్రాల్లో తప్పులు ఉండటంతో రిటర్నింగ్ అధికారి వెనక్కి పంపించారు. కడప జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జమ్మలమడుగు నగర పంచాయతీకి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ పట్టణంలో ఎన్నికలు జరిపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జమ్మలమడుగు నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. మొత్తం 20 వార్డులకు, 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సహకారంతో ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని చెప్పారు.
విశాఖ వేపగుంట ఆరో జోన్లో గ్రేటర్ విశాఖకు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇవాళ పది నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో కౌన్సిలర్ల స్థానాలకు నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులూ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చారు. నామినేషన్ల ప్రక్రియను తెదేపా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పర్యవేక్షించారు.