కరోనా బాధితులకు సేవ చేసేందుకు ఆయన ఎక్కడ వెనుకడగు వేయలేదు. మహమ్మారి బారిన పడిన వారికి ఆహారం, వసతులు, తదితర విషయాల్లో ఎటువంటి లోటు రానివ్వలేదు.ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. చివరికి కరోనా సోకినా తిరిగి విధుల్లో చేరి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన ఇన్ని సేవలకు ఏకంగా జెనీవా దేశానికి చెందిన నీతి అయోగ్ అనుబంధ సంస్థ అయిన "నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్" సంస్థ జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది.
నోడల్ అధికారిగా కరోనా బాధితులకు ప్రభాకర్ రెడ్డి సేవలు
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ రోజుకు సగటున 700 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం జిల్లాలో దాదాపు 8 ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి నోడల్ అధికారులను నియమించింది. లాక్ డౌన్ సమయంలో విదేశాల నుంచి జిల్లాకు వచ్చేవారు, జిల్లాలో ఉన్న వలస కార్మికులను విదేశాలకు పంపడం వంటి కార్యక్రమాలు చేశారు. ఈ విధంగా కడప యోగివేమన విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాలను క్వారంటైన్ కేంద్రాలుగా చేశారు. వాటికి జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డిని నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు.
మార్చి 24 నుంచి జులై ఆఖరు వరకు ప్రభాకర్ రెడ్డి నోడల్ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ సమయంలోనే క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 1850 మందికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే రిమ్స్ లేదా తిరుపతి ఆసుపత్రికి పంపించే విధంగా చర్యలు చేపట్టారు. వీటితోపాటు జిల్లాలోని వలస కార్మికులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుర్తించడమే కాకుండా... వారికి కావాల్సిన కూరగాయలు, నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. దాదాపు 2 వేల మంది వలస కార్మికులకు 15 రోజులకు సరిపడా వస్తువులు అందజేసి... వారిని సురక్షితంగా వారి రాష్ట్రాలకు వెళ్లే విధంగా నోడల్ అధికారిగా పర్యవేక్షణ చేశారు.