పాలకుల నిర్లక్ష్యంతో బీడులా మారుతున్న బ్రహ్మం సాగర్ - kadapa
కృష్ణానదికి ఎన్ని సార్లు వరద నీరు వచ్చినా వ్యవసాయ రంగానికి ఆధారమైన జలాశయాలకు నీరు అందని దుస్థితి నెలకొంది. దీంతో లక్షలాది ఎకరాలకు నీరు అందక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కడప జిల్లా బ్రహ్మం సాగర్ జలాశయానికి ఇదే పరిస్థితి నెలకొంది.

రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి జలాశయాల్లో నీరు అడుగంటుంతోంది... వరద నీరును పట్టించుకోనందున వరుణుడు కరుణించినా రైతు కంట నీరే మిగులుతోంది. రాయలసీమలోని బ్రహ్మం సాగర్ జలాశయానికి ఇదే గతి పట్టింది. ఈ జలశయం నిర్మించి 14 ఏళ్లు గడిచినా పూర్తిస్థాయిలో ఎప్పుడూ నీరు నింపలేదు. దీని సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం డెడ్ స్టోరేజికి చేరింది. దీంతో బద్వేలు, మైదుకూరు నియోజకవర్గంలోని లక్షన్నర ఎకరాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
కృష్ణానదికి అనేక పర్యాయాలు వరద నీరు వచ్చినా పాలకుల నిర్లక్ష్యానికి నీరు అట్టడుగుకు చేరుతోంది. గలగల పారాల్సిన కాలువలు వెలవెలబోతున్నాయి. దీని పరిధిలో ఉన్న ఆయకట్టు భూముల్లో పంటలు.... సాగు లేక కంపచెట్లతో అడవిని తలపిస్తున్నాయి.
పోరుమామిళ్ల, బద్వేలు పెద్ద చెరువులకు బ్రహ్మంసాగర్ జలాశయాన్ని అనుసంధానం చేశారు. కాలువల నిర్మాణంలో జాప్యం జరగడంతో చెరువులకు నీరు అందని దుస్థితి నెలకొంది. నీరు వస్తుందని ఆశతో సాగు చేసిన ఆయకట్టు ఏటా ఎండిపోతోంది. రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా బ్రహ్మసాగర్ జలాశయానికి పూర్తిస్థాయి 17 టీఎంసీల నీరు నింపి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.