Problems in Indiranagar: వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ ఏర్పాటు చేసిన కాలనీలోనే నివాసితులు సమస్యల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన ఇందిరానగర్లో నేటికీ తిష్ట వేసిన సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. నాడు వైఎస్.. నేడు ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి చేపట్టినా సొంత జిల్లా అయినప్పటికీ ఇందిరా నగర్లోని ప్రజల ఇక్కట్లు తీరడం లేదు. అధికారంలోకి ఎవరొచ్చినా తమ కష్టాలు, కడగండ్లను తీర్చే నాథుడే కనిపించడం లేదని ఇందిరా నగర్ కాలనీవాసులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పన్నులు చెల్లిస్తున్నా మౌలిక సౌకర్యాలు కల్పించరా?..: ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇందిరానగర్ కాలనీవాసుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఆయా కాలనీల్లో మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ఎంతోమంది అధికారులు నాయకులు వస్తూ పోతున్నారు గానీ సమస్యలు పరిష్కరించే నాథుడే కనిపించలేదు. ఇటీవల 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించినప్పటికీ సమస్యల పరిష్కారంలో అధికారపక్ష నేతలు శ్రద్ధ చూపడం లేదు. సమస్యల పరిష్కారం కోసం ఆ కాలనీవాసులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.
సిమెంటు రోడ్లే లేవు..: కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందిరానగర్ ఉంది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ కాలనీని ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో సుమారు 6000 నివాసాలు ఉన్నాయి. చిన్న పెద్ద అందరూ కలుపుకొని 20 వేల మంది జీవిస్తున్నారు. అందరూ పేద మధ్యతరగతి ప్రజానీకమే. దినసరి కూలీలే ఎక్కువమంది ఉన్నారు. ఈ కాలనీలోని మూడవ సెక్టార్లో ఇప్పటివరకు సిమెంటు రోడ్లు లేకపోవడం దారుణం. మట్టి రోడ్లు పైగా ఎగుడుదిగుడు రోడ్లతోనే ఈ కాలనీవాసులు నెట్టుకొస్తున్నారు. ఈ కాలనీలోకి ఆటోలు రావాలంటే కూడా భయపడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మట్టిరోడ్లపై భారీగా నీరు చేరి నడవాలంటే కూడా గగనంగా ఉంటుంది.
గుంతల్లో మురుగునీరు..: పైగా మురికి కాలువలు లేకపోవడంతో నివాసాల వద్దనే గుంతలు తీసుకొని నీటిని నిల్వ ఉంచుతున్నారు. గుంత నిండితే ఆ నీటిని రోడ్లపైకి వదులుతున్నారు దీంతో స్థానికంగా గొడవలు జరుగుతున్నాయి. నివాసాల చుట్టూ మురుగు కాలువలు ప్రవహించడంతో దోమలతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు లేకపోవడంతోనే మురుగు సమస్య వేధిస్తోంది.