ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుపాను బీభత్సం ఓ వైపు.. అధికారుల నిర్లక్ష్యం మరోవైపు! - నివర్ తుపాను ఎఫెక్ట్ తాజా వార్తలు

నివర్ తుపాను బీభత్సం సృష్టించి నాలుగు రోజులు దాటినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బురద కష్టాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. కడప.. బుగ్గవంక ఉగ్రరూపం దాల్చడంతో పలు కాలనీలు జలదిగ్బంధమై.. బురద అలాగే ఉంటడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ బురద పేరుకు పోయి ఉంది. కట్టుబట్టలతో ప్రజలు బయటకు వచ్చారు.

తుపాను బీభత్సం ఓ వైపు.. అధికారుల నిర్లక్ష్యంతుపాను బీభత్సం ఓ వైపు.. అధికారుల నిర్లక్ష్యం మరోవైపు! మరోవైపు!
తుపాను బీభత్సం ఓ వైపు.. అధికారుల నిర్లక్ష్యం మరోవైపు!

By

Published : Nov 30, 2020, 8:55 PM IST

నివర్ తుపాను కారణంగా కడప బుగ్గవంక ప్రాజెక్టు జలాశయం నుంచి వచ్చిన వరదనీరు.. కడప నగరాన్ని ముంచెత్తింది. బుగ్గవంక కాల్వ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో పది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బురద, చెత్తాచెదారం, కంపచెట్లు మొత్తం కాలనీలు, ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చాయి. నాలుగు రోజులు అవుతున్నా మున్సిపల్ అధికారులు బురద తొలగించే చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రధానంగా రవీంద్రనగర్, నాగరాజుపేట, నభీకోట ప్రాంతాల్లో ఇప్పటికీ కాలనీల్లో బురద, చెత్తాచెదారం పేరుకు పోయింది. దుర్గంధం వెదజల్లే చెత్తాచెదారం మధ్య కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 500 ఇళ్లు ముంపునకు గురైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 50 శాతం ఇళ్లలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో వస్తు సామగ్రి, ధాన్యం మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. కనీసం అధికారులు ఇటువైపు వచ్చి పలకరించడం లేదని ముంపు బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక్కో కుటుంబానికి 20 వేల నుంచి 5 లక్షల రూపాయలపైగానే ఆస్తినష్టం సంభవించి ఉంటుంది. ఎంత నష్టం జరిగిందనే జాబితాను అధికారులు ఇంతవరకు రూపొందించడం లేదు.

పది కాలనీల్లో కోట్ల రూపాయల నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. కాలనీల్లో బురద తొలగించక పోవడంతో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు మరింత కుంగిపోతున్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు భోజన ప్యాకెట్లు అందిస్తే కాలం వెల్లదీస్తున్నారు తప్పితే... అధికార యంత్రాంగం ఎలాంటి సాయం అందించలేదని కాలనీవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

బుగ్గవంక మిగిల్చిన విషాదంలో భారీగా ఆస్తినష్టం జరగడంతో నష్టం అంచనాల వేసేందుకు అధికారులు ఇంకా నివేదిక తయారు చేయడంలోనే కాలం వెల్లదీస్తున్నారు. తుపాను కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు పరిహారం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి వేల రూపాయల నష్టం జరిగితే 500 రూపాయల ఏం సరిపోతాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బుగ్గవంకలో నిరాశ్రయులైన వారికి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అఖిలపక్షం నాయకులు డిమాండు చేశారు. ఈ మేరకు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. బుగ్గవంకను ముంచెత్తడానికి కారణం... వాటిలో ఆక్రమణలు తొలగించక పోవడమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2001లో జరిగిన బుగ్గవంక ముప్పును మరోసారి అధికారులు గుర్తు చేశారని ఎద్దేవా చేశారు.

కాగా బుగ్గవంక బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల సాయాన్ని రవీంద్రనగర్ నుంచి పంపిణీ చేశారు. కానీ ఇది తమకు సరిపోదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:విశాఖ పోర్టుకు తొలిసారి భారీ నౌక రాక

ABOUT THE AUTHOR

...view details