కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నివర్ తుపాన్ ప్రభావం కొనసాగుతోంది. తిరుపతి ప్రధాన రహదారి కుక్కలదొడ్డి సమీపంలో కొండలపై నుంచి వర్షపు నీరు.. ప్రధాన రహదారిపైకి రావటంతో రోడ్డు కోతకు గురై.. తిరుపతి, కడప వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నియోజకవర్గం అంతటా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తుపాన్ ప్రభావం వలన చెరువులు నిండుకుండలను తలపించటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పండ్ల తోటల రైతులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బద్వేలులోని భగత్ సింగ్ కాలనీ నీట మునిగింది. నాగుల చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీని చుట్టుముట్టింది. దీంతో 257 ఇళ్లు నీట మునిగాయి. దీంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్టీసీ గ్యారేజ్‌లోకి వర్షపు నీరు చేరటం.. బస్సులు మరమ్మత్తులు నిలిచిపోయాయి. రహదారులన్నీ జలమయమవ్వటం.. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.