కడప జిల్లా రాయచోటి రహదారుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు అప్రమత్తమై సకాలంలో అభివృద్ధి పనులు చేపట్టాలి. అడ్డంకుల తొలగింపునకు ఆయా శాఖల సమన్వయంతో ముందుకెళితే పనులు ముగింపు గడువులోగా పూర్తిచేసే అవకాశం ఉంటుంది. జనసమూహాలు, వాహన రద్దీ ఉన్న పట్టణాల్లోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు.
జిల్లాలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి సుమారు 80 కిలోమీటర్ల పొడవున విస్తరించింది. రహదారి అభివృద్ధికి మూడేళ్ల కిందట కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చింది. రూ.250 కోట్లకుపైగా వెచ్చించి జిల్లా సరిహద్దులోని సంబేపల్లె నుంచి కడప ఘాట్రోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టారు. ఈ మార్గంలో మండల కేంద్రాలు, రాయచోటి పట్టణ నడిబొడ్డున నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. రహదారిని విస్తరించేందుకు పంచాయతీలు, పురపాలక, విద్యుత్తు, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖలకు సంబంధించిన పనులు చేపట్టడంలో సమన్వయం లోపించింది. ఫలితంగా గత మూడేళ్లుగా చాలా ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఎడతెగని జాప్యం
జాతీయ రహదారి-44 రాయచోటి నడి బొడ్డు మీదుగా సుమారు అయిదు కిలోమీటర్ల పొడవున వెళుతుంది. చిత్తూరు, కడప మార్గంలోని ప్రధాన కూడళ్ల నుంచి మధ్య మార్గంలో పట్టణం విస్తరించింది. ఇరువైపులా ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం నివాసాల వారికి పరిహారం చెల్లింపులు పూర్తి చేసింది. ఆక్రమణల తొలగింపులో కొన్ని ప్రాంతాల్లో అడ్డంకులు నేటికీ తొలగలేదు. ఫలితంగా రహదారి విస్తరణ ప్రహసనంగా మారింది. రూ.200 కోట్ల పనుల్లో 80 శాతం పూర్తికాగా మిగిలినవి మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. నేతాజీ కూడలి నుంచి దిగువ మాసాపేట వరకు విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
రహదారికిరువైపులా ఉన్న భవనాల యజమానులతో అధికారులు చర్చలు జరిపి పరిహారం చెల్లింపులు చేశారు. అయినా వాటిని తొలగింపునకు ససేమిరా అంటూ జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారి విస్తరణ సంస్థ అధికారులు యంత్రాలతో తొలగింపు పనులు చేపట్టారు. స్థానికులు తామే స్వచ్ఛందంగా తొలగిస్తామని చెప్పి అడ్డుకున్నారు. ఠాణా నుంచి దిగువ పెట్రోలుబంకు వరకు ఒక వైపు మాత్రమే తొలగించారు. మరోవైపు రహదారిపైనే భవనాలు ఉండిపోయాయి. వీటి తొలగింపులో జాప్యం జరగడంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇరువైపులా రహదారిపై ఉన్న భవనాలు తొలగించకుండానే విభాగిని ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
రహదారిపైనే విద్యుత్తు స్తంభాలు...
రాయచోటి పట్టణ పరిధిలో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. వీటికి ఇరువైపులా విద్యుత్తు స్తంభాలు విస్తరించాయి. 50 ఏళ్ల కిందట నాటిన స్తంభాలే ఉండడంతో విస్తరణ సమయంలో వాటిన్నంటినీ తొలగించాల్సి వచ్చింది. చిత్తూరు-కర్నూలు, కడప-బెంగళూరు జాతీయ రహదారులు పట్టణం మీదుగానే వెళతాయి. ఈ రెండు రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నా విద్యుత్తు స్తంభాల తొలగింపు పనులు మాత్రం ఇంతవరకు చేపట్టలేదు. వాహనాల రాకపోకలు ఇదే మార్గాల్లో సాగుతుండటంతో స్తంభాలు కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారి విస్తరణ సంస్థ అధికారులు విద్యుత్తు స్తంభాల మార్పిడికి అవసరమైన నిధులను ఎస్పీడీసీఎల్‌కు ఇప్పటికే చెల్లించారు. విద్యుత్తు లైన్ల మార్పిడికి తక్కువ ధర గిట్టుబాటు కావడం లేదన్న భావన గుత్తేదారుల్లో ఉండడంతోనే పనులు సకాలంలో చేయడంలేదన్న విమర్శలు ఉన్నాయి.