ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా... క్రమేణా నాటుకుంటోంది! - కడపలో పెరిగిన నాటుసారా అమ్మకాలు

కడప జిల్లాలో మందుబాబుల పరిస్థితి ఎలా తయారైందంటే.. కిక్కు ఇస్తే చాలూ అది మద్యమా.. సారా అని పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఏడాది కిందట జిల్లాలో నాటుసారా జాడలు అతి కొద్ది ప్రాంతాల్లోనే కనిపించేవి. ఇటీవల అయిదు నెలలుగా నాటుసారా తయారీ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. గతంలో నాటుసారా జోలికి వెళ్లని వారు కూడా ప్రస్తుతం తయారీపై దృష్టిసారిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయంగా నాటుసారా తయారీకి గిరాకీ పెరిగింది. లీటరు సారా రూ.1,000కు విక్రయిస్తుండగా అధిక డబ్బులు వెచ్చించి మద్యం కొనలేని వారు సారా కొని తాగుతున్నారు. ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ సారా తయారీ మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట సారా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన అయిదు నెలల్లో 312 నాటుసారా కేసులు నమోదు చేసి 272 మంది అరెస్టు, 835 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

natusara sales
నాటుసారా

By

Published : Oct 12, 2020, 12:54 PM IST

కడప జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, గాలివీడు, సుండుపల్లె, పులివెందుల, చింతకొమ్మదిన్నె ఇలా సుమారు 80 గ్రామాల్లో నాటుసారా తయారవుతోంది. అధికారులు పరివర్తన కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తూ ఆ సంఖ్య తగ్గించారు. నాటుసారా తయారీపై ఆధారపడి జీవించేవారికి అధికారులు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి వారితో సారా తయారీని మాన్పించారు. అయితే రాష్ట్రంలో గత అయిదారు నెలలుగా మద్యం ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో మద్యం కొనలేని వారు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా నాటుసారా తయారు చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సారా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తయారు చేస్తున్నారు. ఇదొక కుటీర పరిశ్రమలా మారిందంటే అతిశయోక్తి కాదు. లీటరు సారా ధర రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు పలుకుతోంది.

అటవీ ప్రాంతాలే అడ్డాగా..

జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ జోరుగా సాగుతోంది. మనుషులకు డబ్బులిచ్చి వారితో సారా తయారీ చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేకపోవడంతో సంపాదించుకోవచ్చునని చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారుల దాడులు కాస్త తగ్గుముఖం పట్టడంతో సారా తయారీదారులు రెచ్చిపోతున్నారు. ఇలా తయారు చేసిన సారాను రెండో కంటికి కనిపించకుండా గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్రవాహనాలు, ఆటోల్లో రవాణా చేస్తుండడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లోని విక్రయదారులకు లీటర్ల చొప్పున విక్రయిస్తారు. వారు మందుబాబులకు ప్లాస్టిక్‌ సీసాల్లో అమ్మకాలు జరుపుతున్నారు.

నిరంతరం దాడులు చేస్తున్నాం

జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేస్తున్నాం. నాటుసారా ప్రభావితమైన ప్రాంతాల్లో పరివర్తనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నాటుసారా జోలికి వెళితే కలిగే నష్టాలు తెలియజేస్తున్నాం. ఎస్‌ఈబీ ఏర్పడిన అనంతరం జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యంపై పూర్తిస్థాయిలో నిఘా పెంచాం. - శ్రీనివాసరావు, సహాయ కమిషనర్, ఎస్‌ఈబీ, కడప.

వివరాలు
నాటుసారా

ఇదీ చదవండి: పులివెందులలో కర్ణాటక మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details