ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sand mafia in Kadapa district : రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. సీఎం జిల్లాలో సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం - Department of Mines

Sand mafia in Kadapa district : ఇసుక మాఫియా ఆగడాలకు ఉన్నదంతా పోగొట్టుకుని ఓ వ్యాపారి ఆత్మహత్యకు యత్నించాడు. సీఎం సొంత జిల్లాలో ఆయన సమీప బంధువే మోసం చేశాడని ఇసుక వ్యాపారి నారాయణరెడ్డి పురుగుల మందు తాగాడు. బిడ్డ చదువుకోసం దాచుకున్న సొమ్మంతా తీసుకొచ్చి వ్యాపారంలో పెడితే.. అనధికార రీచ్‌ అంటగట్టారని వాపోయాడు. కట్టిన సొమ్ము తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ నారాయణరెడ్డి వాపోయారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 10, 2023, 8:46 AM IST

Updated : Jun 10, 2023, 10:52 AM IST

సీఎం జిల్లాలో సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

Sand mafia in Kadapa district : ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో ఇసుక వ్యాపారి ఆత్మహత్యకు యత్నించారు. సీఎం సమీప బంధువు దుగ్గాయపల్లె వీరారెడ్డి ఇసుక వ్యాపారం పేరిట తనను మోసం చేశాడంటూ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.. పోకల నారాయణరెడ్డి. పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన పోకల నారాయణరెడ్డి..వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఇసుక రేవు లీజుదక్కించుకున్నారు. దీనికోసం వీరారెడ్డికి రూ.81 లక్షలు చెల్లించినట్లు నారాయణరెడ్డి తెలిపారు. కొన్నాళ్లపాటు ఇసుక తవ్వకాలు జరిపినా.. ఆ రేవుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. దీంతో తాను చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలని వీరారెడ్డిని కోరగా.. సానుకూల స్పందన రాకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నారాయణరెడ్డి ఆరోపించారు. దీంతో గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద వీరారెడ్డి నిర్వహిస్తున్న ఇసుక రేవు వద్దకు వెళ్లి నారాయణరెడ్డి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

కూతురు మెడికల్ సీటు కోసం... తన కుమార్తె మెడికల్‌ సీటు కోసం దాచుకున్న డబ్బును ఇసుక వ్యాపారానికి కట్టి మోసపోయానని నారాయణరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో వేరొకరితో ఫోన్ చేయించగా..వీరారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నారాయణరెడ్డి వాపోయారు. దొంగ ఇసుక రీచ్‌ తనకు అంటగట్టి పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు సంబంధం లేదన్న వీరారెడ్డి.. ఐదుగురు భాగస్వాములు కలిసి తన వద్ద ఇసుక రీచ్‌ను సబ్‌ లీజుకు తీసుకున్నారని... నిర్వహణ సరిగ్గా చేయలేకే తప్పుకున్నారని వీరారెడ్డి తెలిపారు. వారికి తాను రూ.8 లక్షల వరకు ఇవ్వాలని.. టిప్పర్ల అద్దె, పెట్రోల్ బంక్‌లో బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున ఆ సొమ్ము వారికి ఇవ్వలేదన్నారు. నారాయణరెడ్డి కూడా వారిలో ఒకరని తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. అందరూ కలిసి వచ్చి అడిగితే ఎప్పుడో ఈ విషయం తేల్చేసేవాడినని వీరారెడ్డి అన్నారు. అనుమతి ఉన్న రేవులోనే వారికి ఇసుక తవ్వకానికి అవకాశమిచ్చానని వివరించారు.

అధికార పార్టీ నేతల ద్వారానే అక్రమ తవ్వకాలు...సిద్దవటం మండలంలోని జ్యోతి, ఎస్‌.రాజంపేట, జంగాలపల్లె రేవుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా.. అధికార పార్టీ నేతల ద్వారా అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులకు విక్రయించకుండా ఇక్కడి నుంచి హైదరాబాదు, బెంగళూరుకు ఇసుక ఎగుమతి జరుగుతోంది. ప్రతిరోజూ 300 మంది కూలీలు, భారీగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు రేవులు అప్పగించి నెలకు రూ.3 కోట్ల వంతున అనధికారికంగా వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అనుమతులు లేవని చెబుతున్న గనులశాఖ అధికారులు.. ఇసుక తవ్వకాల విషయం ఎస్‌ఈబీ చూసుకోవాలని దాటవేస్తున్నారు. అనుమతుల్లేని రేవుల నుంచి జేపీ కంపెపీ పేరిట రశీదులు జారీ చేస్తున్నా.. పెండ్లిమర్రి, చక్రాయపేట, ఖాజీపేట మండలాల పరిధిలోని రేవుల నుంచి నిత్యం భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి.

ఖాజీపేట పరిధిలో పెన్నానదిలో చెన్నముక్కపల్లె రేవులో భారీ యంత్రాలు ఉపయోగించి ఇసుక లేకుండా చేశారు. నాలుగున్నర హెక్టార్ల పరిధిలో ఏడాది కాలంలో తవ్వుకోవాలనే నిబంధన అతిక్రమించి కేవలం ఏడు నెలల్లోనే తవ్వుకున్నారు. అనుమతులు, పర్యవేక్షించాల్సిన అధికారులు రేవుల వైపు కన్నెత్తి చూడకపోగా... ఎస్‌ఈబీ ఇసుక వైపే వెళ్లడం లేదని తెలుస్తోంది. ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామం వద్ద ఇసుక తరలిస్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలుపగా... అసలు ఈ రేవుకు అనుమతులు లేకపోవడం విశేషం ఇసుక తవ్వకాలకు జేపీ కంపెనీకి గనులశాఖ కొన్ని రేవులకు మాత్రమే అనుమతులిచ్చింది. కానీ, సిద్ధవటం మండలం జ్యోతి, జంగాలపల్లె, వల్లూరు మండలంలో ఆదినిమ్మాయపల్లె వద్ద భారీ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆదినిమ్మాయపల్లెలో స్థానికులు, టీడీపీ నేతల అభ్యంతరం నేపథ్యంలో తవ్వకాలు ఆగిపోయాయి.

Last Updated : Jun 10, 2023, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details