Nara Lokesh Yuvagalam Padayatra today updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన'యువగళం' పాదయాత్రనేడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ప్రారంభమైంది. జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు లోకేశ్ తన 111వ రోజు పాదయాత్రను మొదలుపెట్టారు. పాదయాత్రలో భాగంగా యువనేత లోకేశ్.. పెద్దపసుపుల మోటు వద్ద స్థానికులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ లక్ష్యం అదే..!.. టీడీపీ శ్రేణులు సంజామల మోటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ''మహిళలను ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లడుగుతారు. ఎందరు పిల్లలుంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తానన్నారు. ప్రస్తుతం జాబ్ క్యాలెండర్, అమ్మ ఒడి ఊసే ఎత్తట్లేదు. 2024లో టీడీపీ (తెలుగుదేశం పార్టీ) అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతిని ఇస్తాం. దాంతోపాటు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1500 సాయం చేస్తాం. తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు రూ.15 వేలు అందజేస్తాం. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
రూ.లక్ష కోట్లు ఉన్న వ్యక్తి పేదవాడవుతారా ఆలోచించాలి. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. విద్యుత్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచారు. దేశంలో వంద సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేసిన ఏకైక వ్యక్తి జగన్. బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోతపెట్టారు. కోత పెట్టిన రిజర్వేషన్లను తిరిగి తీసుకువస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్ ద్వారా రుణాలిప్పిస్తాం. బీసీలపై 26 వేల దొంగ కేసులు పెట్టారు. 2024లో టీడీపీ వచ్చాక బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. ఎస్సీలకు నిలిపివేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తాం. మైనార్టీల కోసం ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం'' అని లోకేశ్ అన్నారు.