TDP Zone-5 Meeting in Kadapa: కడపలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ జోన్-5 నేతలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసుపై చంద్రబాబు స్పందించారు. తన తండ్రిని చంపినవారు ఎవరో తెలియాలని వివేకా కుమార్తె పోరాడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోని పోలీసు అధికారులకు వివేకా హత్య కేస్ స్టడీగా మారుతుందని చంద్రబాబు వెల్లడించారు. వివేకా హత్య కేసు నిందితులు సీబీఐ అధికారులనూ బెదిరించారంటూ పేర్కొన్నారు. వివేకాను గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రౌడీల తోకలు కట్ చేస్తాం.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తమకు అడ్డు వచ్చిన వారందరినీ చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటూ హితవు పలికారు. త్వరలోనే వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామని తెలిపారు.
టీడీపీ అధికారంలో ఉండగా.. రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. 5.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి కియా మోటార్స్‌ను తెచ్చిన ఘనత తమదేనని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఈ పాటికే కడప స్టీల్‌ప్లాంట్ పూర్తయ్యేదని తెలిపారు. జగన్.. ప్రజలకు నమ్మకం కాదు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రమంటూ చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం పోలీసులకు టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. ఇక జీతాలు ఎప్పుడు పడతాయో ఉద్యోగులకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. టీఏ, డీఏలు దేవుడెరుగు.. జీతాలు పడితే చాలనే పరిస్థితికి ఉద్యోగులు వచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.