ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Complaint: జాతీయ బీసీ కమిషన్‌కు తెదేపా నేత నందం సుబ్బయ్య భార్య ఫిర్యాదు - nandam subbaiah Murder

గతేడాది డిసెంబర్​లో దారుణ హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితులను శిక్షించి.. తన కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ బీసీ కమిషన్‌కు సుబ్బయ్య భార్య ఫిర్యాదు చేసింది. హత్య కేసులో ఎమ్మెల్యే రాచమల్లు, బంగారు రెడ్డి పేర్లు చేర్చాలని ​ఫిర్యాదులో పేర్కొంది.

complaint to bc commission
complaint to bc commission

By

Published : Aug 7, 2021, 9:50 PM IST

Updated : Aug 8, 2021, 1:43 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్‌లో గతేడాది డిసెంబర్‌లో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితులను శిక్షించి.. తన కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ బీసీ కమిషన్‌కు సుబ్బయ్య భార్య అప‌రాజిత ఫిర్యాదు చేసింది. కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారికి కలిసి ఆమె ఫిర్యాదు చేసింది. నందం సుబ్బ‌య్య హత్య కేసులో ఎమ్మెల్యే రాచమల్లు, బంగారుమునిరెడ్డి, పుర‌పాలిక క‌మిష‌న‌రు రాధ పేర్లను చేర్చాలని కమిషన్​కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. త‌న భ‌ర్త హ‌త్య‌కు గురై ఎనిమిది నెల‌లు గ‌డిచినా.. ఆ కేసులో ఎలాంటి పురోగ‌తి లేద‌న్న అప‌రాజిత.. ఇప్పటి వరకు చార్జిషీట్ కూడా వేయ‌లేద‌న్నారు. దీనిపై హైకోర్టును ఆశ్ర‌యిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కేసులో పురోగ‌తి తెచ్చి త‌న కుటుంబానికి న్యాయం చెయ్యాల‌ని జాతీయ బీసీ క‌మిష‌న్ తల్లోజు ఆచారికి విన్న‌వించిన‌ట్లు తెలిపారు.

అసలేం జరిగింది..

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్‌లో డిసెంబర్​ 29, 2020న తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద దుండగులు సుబ్బయ్యను చుట్టుముట్టి, కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో తల నరికేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం జరిగిన సమయంలో అక్కడకు కొద్దిదూరంలోనే పురపాలక శాఖ కమిషనర్‌, ఇతర అధికారులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డిలే ఈ హత్య చేయించారని సుబ్బయ్య భార్య, తల్లి ఆరోపించారు. మృతుడి కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటి నుంచి బయటకు రప్పించి..

ఈశ్వరరెడ్డినగర్‌లో నందం సుబ్బయ్య (41) కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన జిల్లా తెదేపా అధికార ప్రతినిధి. మంగళవారం(డిసెంబర్​ 29) ఉదయం 8.45 గంటలకు ఓ యువకుడు ఇంటి వద్దకు వచ్చి సుబ్బయ్యను బయటకు పిలిచి, తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. గంట తర్వాత సోములవారిపల్లె పంచాయతీ పరిధిలో పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద సుబ్బయ్య ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఓ స్వీయచిత్రం తీసుకుని.. ‘కడప వార్తలు’ అనే వాట్సప్‌ గ్రూపులో ఉదయం 9.40కి పోస్టుచేసి కింద జై తెదేపా, జైజై తెదేపా అనే వ్యాఖ్య జోడించారు. అదే అతని ఆఖరి చిత్రం. వెంటనే కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి.. వేటకొడవళ్లతో తలపై నరికారు. 9.50 గంటలకు ఆయన ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. ఉదయం 10.30 గంటలకు హత్య విషయం సుబ్బయ్య కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే ఆయన భార్య సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు.

ఉదయం 5 గంటల నుంచే రెక్కీ
దుండగులు ముందుగానే సుబ్బయ్య ఇంటి చుట్టూ రెక్కీ చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ అయిదుగురు వ్యక్తులు తిరిగారు. అతని కదలికలు గమనించారు. అలా తిరిగిన వారిలో కొండా రవి, మరో నలుగురు ఉన్నారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. గతంలో రవి తన భర్తను అనేకసార్లు దూషించాడని, అక్రమంగా అత్యాచారం కేసు కూడా పెట్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇటీవల పోలీసుల్ని సుబ్బయ్య కోరినా వారు స్పందించలేదని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్ అరెస్ట్

CBI COURT NOTICES: బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

Last Updated : Aug 8, 2021, 1:43 AM IST

ABOUT THE AUTHOR

...view details