కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూర్వారిపల్లి గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పంచాయతీ పరిధిలోని ఏటి పోరంబోకు స్థలాన్ని.. ప్రార్థన మందిరం పేరిట స్థానికేతరులకు రాజకీయ నాయకులు కట్టబెడుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు. కొందరు ముస్లింలు జేసీబీలతో ఆ భూములను చదును చేస్తుండటాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా రాత్రి నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో జనసేన మద్దతుతో గెలిచిన ఏకైక సర్పంచ్ మైసురువారిపల్లికి ఎన్నికైనందున.. కక్షసాధింపుతో అధికార పార్టీ నేతలు ఈ చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఏటి భూములను ఎవరైనా ఆక్రమిస్తే స్థానిక తహసీల్దార్ గతంలో అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు.. స్థానికేతరులకు కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా పెద్దఎత్తున పోలీసులను మోహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.