Muslim Agitation in Kadapa: రోడ్డ వెడల్పులో భాగంగా శ్మశాన వాటిక ప్రహరీ గోడతో పాటు పలు సమాధులను కూడా కూల్చి వేస్తామని అధికారులు చెప్పడాన్ని నిరసిస్తూ ముస్లింలు కడపలో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ముస్లిం మైనార్టీల ఓట్లతో గెలుపొంది చివరకు వారిని నిలువునా మోసం చేస్తున్నారని ముస్లిం సంఘాల నాయకులు మండిపడ్డారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలోనే ముస్లిం సంఘాలకు సంబంధించిన ఆస్తులకు ఎటువంచి రక్షణ లేకుండా పోయిందని.. ఆయన ఒక ముస్లిం అయి ఉండి కూడా ఓ ముస్లిం శ్మశాన వాటికను కూల్చివేస్తుంటే కనీసం స్పందించకపోవడం దారుణమని వారు అన్నారు.
కడప నగరంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల ఏళ్ల నాటి ముస్లిం శ్మశాన వాటిక కూల్చవద్దంటూ ముస్లింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. మతాల విశ్వాసాలను కూడా అధికారులు గౌరవించాలని ముస్లిం పెద్దలు కోరారు. ప్రస్తుతము చాలా చోట్ల రోడ్లపై పలు మతాలకు సంబంధించిన ప్రార్ధన ఆలయాలు ఉన్నాయి. వాటిని వాటి స్థానంలో అలానే ఉంచి.. వాటి పక్క నుంచి రోడ్లు వేసుకొని వెళ్తున్న సంఘటనలు చాలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కానీ కడపలో మాత్రం నగరపాలక కమిషనర్ మొండి పట్టుపట్టి ముస్లిం స్మశాన వాటిక ప్రహరీని కూల్చి వేస్తామని నోటీసులు ఇవ్వడం దారుణమని తాము ఈ చర్యను ఖండిస్తున్నాము అని వారు అన్నారు. ప్రభుత్వ అధికారులు కనుక ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ముస్లింలు హెచ్చరించారు.
CHANGES IN ROAD WIDTH: రోడ్డు వెడల్పు కుదింపునకు గ్రీన్ సిగ్నల్.. వెల్లువెత్తుతున్న వ్యతిరేకత