TABLA ARTIST: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం పార్వతీనగర్‌లోని వీరభద్రయ్య-సుగుణమ్మ దంపతులకు నటరాజ్ జన్మించారు. వీరభద్రయ్య దశాబ్ధాల కాలంగా హరికథ విద్వాంసుడుగా పని చేస్తుండగా.. తండ్రికి సహాయకుడిగా మృదంగం, తబలా వాయించేవాడు నటరాజ్. ఆ విధంగా వంశపారంపర్యంగా వచ్చిన కళను అందిపుచ్చుకున్న నటరాజ్.. 2000 సంవత్సరంలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ మ్యూజిక్‌లో మృదంగం కోర్సు చేశాడు.
పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు వద్ద మృదంగం నేర్చుకున్నాడు నటరాజ్. పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు 9 మృదంగాలపై "నవమృదంగం" పేరుతో 36 గంటల పాటు వాయించి గిన్నిస్ రికార్డు సాధించారు. నవమృదంగం బ్రహ్మగా పేరు గాంచారు. గురువు సాధించిన రికార్డును తాను కూడా వినూత్నంగా సాధించాలనే పట్టుదలతో నటరాజ్ వినూత్న పంథా ఎంచుకున్నాడు. మృదంగాలను కొనుగోలు చేయాలంటే ఆర్థికంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా భావించిన ఆయన.. తబలా ద్వారానే సరికొత్త ప్రయోగం చేయాలని సాధన చేశాడు.
గురువు 9 మృదంగాలపై సాధించిన రికార్డును.. తాను రెట్టింపుగా 18 తబలాల ద్వారా సాధించాలని ఆరేళ్లపాటు కఠోర సాధన చేశాడు. ఒకేసారి 18 తబలాలపై అన్నమాచార్య, త్యాగరాజ కీర్తనలు, వాగ్గేయకారుల పద్యాలను లయ బద్ధంగా తబలాలపై వాయిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. దీంతోపాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కింది.
కర్నాటక సంగీతంలో 18 తబలాలనే ప్రధాన వాయిద్యాలుగా మార్చి.. క్లాసికల్ పాటలు, పద్యాలు, కీర్తనలను శృతి, లయబద్దంగా.. 2021 డిసెంబరు 23న హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆనాటి కచేరిని రికార్డు చేసిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు.. నటరాజు సాధించిన ఘనతను గుర్తిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఆయన పేరును నమోదు చేశారు. రెండు రోజుల కిందట ఇండియా బుక్ ఆఫ్ రికార్డుతో నమోదైన పుస్తకం, ప్రశంసా పత్రం, మెడల్, అరుదైన పెన్ను నటరాజ్ ఇంటికి పంపించారు.
18 తబలాలపై అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలతో పాటు వాగ్గేయకారుల కృతలును వాయించడమే కాకుండా.. హిందోళ రాగంలో సామజవరగమన రాగం వాయించాడు. అదే సమయంలో "నవరాగమాలిక" పేరుతో 9 రాగాలను కూడా 18 తబలాలపై వాయించాడు నటరాజ్. తాను సాధించిన ఘనతకు ఇప్పుడు సంతోషంగా ఉందన్న ఆయన.. గిన్నిస్ రికార్డు కోసం కూడా దరఖాస్తు చేశానని.. వాటిలో కూడా చోటు దక్కుతుందనే నమ్మకం ఉందన్నాడు