Municipal officials locked the shops: వారంతా కొంత కాలంగా నగరపాలక సంస్థకు చెందిన దుకాణాల్లో నెలకు రూ.1500 అద్దె ఇస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే నగరపాలక అధికారులు రూ.1500 ఉన్న అద్దెను ఒక్కసారిగా రూ. 5500 చేశారు. ఇదే విషయమై వారంతా అధికారుల చుట్టూ తీరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అధికారులతో పని కాదనుకున్న వ్యాపారులంతా.. కోర్టు మెట్లెక్కారు. ఇదే అంశంపై కోర్టు స్టే సైతం ఇచ్చింది. అయినా, ఈ రోజు నగరపాలక అధికారులు అద్దె చెల్లించడం లేదంటూ.. 20 దుకాణాలను సీజ్ చేశారు. ఎంతో కాలంగా వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలను ముసేయడంతో.. వ్యాపారులంతా ఆందోళన చేపట్టిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకుంది.
కడప నగరపాలక కార్యాలయ ఆధీనంలో 20 గదులున్నాయి. ఈ గదుల్లో కొంతకాలం నుంచి వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. గతంలో 1500 నుంచి 2000 వరకు అద్దె చెల్లించేవారు. అధికారులు ఒక్కసారిగా 5500 అద్దె పెంచడంతో దుకాణా దారులందరూ కోర్టును ఆశ్రయించారు. పెంచిన గదుల అద్దెలను చెల్లించలేదని కడప నగరపాలక అధికారులు 20 గదులను సీజ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నగరపాలక అధికారులు గదులను సీజ్ చెయ్యడం దారుణమని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో స్టే ఉండగానే అధికారులు దుకాణాలను సీజ్ చేయడాన్ని వ్యాపారులు ఖండించారు. పైగా శని, ఆదివారం కావడంతో గదుల యజమానులు కోర్టుకు వెళ్ళలేరనే ఉద్దేశంతోనే.. ఉన్నఫలంగా ఇలా చేశారంటూ వ్యాపారులు ఆరోపించారు.