Badvel municipal meeting: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో బిల్లులు చెల్లింపు ఆలస్యంపై కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులకు చెల్లించకపోతే ఎలా అని అధికారులను ముకుమ్మడిగా ప్రశ్నించారు. తక్షణమే బిల్లులు చెల్లించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
సమస్యలను ఏకరువు పెట్టిన కౌన్సిలర్లు: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పురపాలక సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 130 కోట్లు మంజూరు చేస్తే, అందులో 50 కోట్ల విలువైన పనులు చేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు. అధికారుల తీరు వల్ల మిగిలిన పనులను చేయగలమా? లేమా? అంటూ అధికారులను ప్రశ్నించారు. చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంపై అధికారులను నిలదీశారు. కంప్యూటర్లో సాంకేతిక కారణాలు తలెత్తడం వల్ల బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోందని కౌన్సిలర్లకు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు కౌన్సిలర్లు వార్డులలో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం సమస్యలు వేధిస్తున్నాయని ఏకరువు పెట్టారు. 22వ వార్డులో రహదారులు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోవడంలేదని కౌన్సిలర్ విజిత అసహనం వ్యక్తం చేశారు. తాము వీధిలో నాటుకున్న చెట్లను సీసీ రోడ్ల నిర్మాణానికి అడ్డొస్తున్నాయని నరికేశారన్నారు. వాటి స్థానంలో మళ్లీ మొక్కలను పెంచకపోవడం బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మెరుగైన సేవల కోసం కృషి చేస్తామన్న చైర్మన్:ఈ విషయంపై స్పందించిన ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డి తక్షణమే ఆ వార్డు సెక్రటేరియట్స్ ఇద్దరిని సస్పెండ్ చేస్తే సిగ్గు వస్తుందని అన్నారు. ఆ ఇద్దరి పై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కృష్ణారెడ్డిని ఛైర్మన్ ఆదేశించారు. ప్రతీ వార్డు కార్యదర్శులు పురవీధులలో పర్యటించాలని ఆదేశించినట్లు తెలిపారు. తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కౌన్సిలర్ చిన్నయ్య మాట్లాడుతూ గడపగడప ఎమ్మెల్యే కార్యక్రమంలో తమ వార్డులో విద్యుత్ తీగలు, వాటర్ పైపులైన్ సమస్య ఉందని ప్రజలు తెలిపినట్లు.. ఆ దిశగా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కౌన్సిలర్లు చర్చించిన సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఛైర్మన్ రాజగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు.