రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయిస్తాం గానీ.. ఆయన ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కడపలో వైకాపా కార్యకర్తల సమావేశానికి హాజరైన మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుకెళ్తాం: ఎంపీ మిథున్‌రెడ్డి - ఏపీ పంచాయతీ ఎన్నికలు న్యూస్
మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికి పరిమితం చేయాలన్న ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుకెళ్తామని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులను బెదిరించేలా ఎస్‌ఈసీ తీరు ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా చేస్తున్నారని ఆరోపించారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహార శైలిని వైకాపా ముందు నుంచే అనుమానం వ్యక్తం చేస్తోందని.. ఇపుడు ఆధారాలతో సహా రుజువు అయ్యే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడికి లబ్ధి చేకూర్చి.. ప్రభుత్వంపై కక్ష తీర్చుకునే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. రోజుకు రెండుమూడు ఆదేశాలిచ్చి తాత్కాలిక ఆనందం పొందవచ్చు గానీ.. వైకాపా ప్రభుత్వాన్ని ఎవరు దెబ్బ తీయలేరన్నారు. జిల్లాల పర్యటన చేస్తున్న ఎస్ఈసీ.. అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తూ ఆ నెపాన్ని ప్రభుత్వం, మంత్రులపైనా వేస్తున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా