కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని వెలిదండ్ల, తాతిరెడ్డి పల్లె, కోమన్నూతల, చెర్లోపల్లి, పార్నపల్లి గ్రామాల్లో గత రాత్రి కురిసిన గాలివానకు అరటి చెట్లు నేలకొరిగాయి. మండలంలోని దాదాపు 1500 ఎకరాలలో అరటి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఉద్యాన, రెవెన్యూ అధికారులతో కలిసి నష్టపోయిన పంటను పరిశీలించారు. 2, 3 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా ఈ విధంగా జరగడం బాధాకరమన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసి నివేదిక తనకు అందజేయాలి అధికారులను ఆదేశించారు.
'గాలివానకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం' - పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి
రైతులపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. అసలే కరోనా కారణంగా పండిన పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్న అన్నదాతలను... గాలి, వాన రూపంలో మరింత క్షోభ పెట్టింది. గాలికి పడిన అరటి చెట్లను, నీటిలో నానిన వరి పనలను చూసి రైతన్న పడుతున్న ఆవేదన చూసేవారినీ కన్నీరు పెట్టిస్తోంది. కడప జిల్లా పులివెందులలో నష్టపోయిన పంటను ఎంపీ అవినాశ్ రెడ్డి పరిశీలించి, ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
నష్టపోయిన పంటను పరిశీలిస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి