ఆ తల్లి తనువు చాలించడానికి చేసిన ధైర్యం బతకడానికి చేయలేకపోయింది.. పిల్లల ప్రాణాలు తీయడానికి చేసిన సాహసం జీవించడానికి చేయలేకపోయింది.. పురిటి నొప్పులు భరించిన ఆ మాతృ మూర్తి సంసార కష్టాలను ఎదుర్కోలేకపోయింది.. సమస్యలకు చావే పరిష్కారమనుకుంది.. కష్టాలకు మృత్యువే జవాబు అనుకుంది.. కుటుంబ కలహాలతో తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. భర్త కూలి పనులకు వెళ్లగా భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో! - ఆత్మహత్య
15:43 October 30
కడప జిల్లాలో బావిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామ సమీపంలోని సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన పురం రామనాథ్‌కు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన అనిత(28)తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారులు ధనుష్ (6), భార్గవ్ (4) ఉన్నారు. భర్త పెయింటర్‌గా పని చేస్తుండడంతో ఇటీవల గ్రామం నుంచి పట్టణానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో శనివారం మధ్యాహ్నం అనిత తన ఇద్దరు పిల్లలతో కలిసి చిన్నమండెం మండలం మల్లూరు సమీపంలోని ఓ మామిడి తోట వద్దనున్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామనాథ్‌కు అనిత రెండో భార్య కావడం గమనార్హం. స్థానికుల సమాచారంతో తహసీల్దారు నాగేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ రవీంద్ర, కానిస్టేబుల్ కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని సిబ్బంది సాయంతో మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహాలను జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథరెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పరిశీలించారు. ఆత్మహత్య ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. తల్లీకుమారుల మృతితో భార్యాభర్తల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:FARMER SUICIDE: అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య