Complaint against moneylender: వైయస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మిశెట్టి చిన్న ఓబులేసు అనే వ్యక్తి చీటీల పేరుతో రూ. 20 కోట్ల రూపాయలు మోసం చేసి ఉడాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని కలిశారు. గత 15 ఏళ్లగా చీటీలు నిర్వహిస్తున్న ఓబులేసును నమ్మి 100 నుంచి 150 మంది వరకు చీటీలు, వడ్డీలకు అప్పులు ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. పిల్లల చదువులు, వివాహాలకు ఇతరత్రా అవసరాల కోసం ఓబులేసును నమ్మి అతడి వద్ద చీటీలు వేసినట్లు బాధితులు వెల్లడించారు. గత కొంత కాలంగా నమ్మకంగా అందరికి డబ్బులు ఇచ్చేవాడనీ.. ఒక్కసారిగా బోర్డు తిప్పాడని బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చేత లక్షల రూపాయల మేరకు చీటీలు వేయించి, ఆ డబ్బులతో ఉడాయించాడని ఓబులేసు చేతిలో మోసపోయిన బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలకు చీటీలు వేసినట్లు వెల్లడించారు.
Moneylender Fraud: రూ. 20 కోట్లకు వ్యాపారి కుచ్చుటోపి.. లబోదిబోమంటున్న బాధితులు
Moneylender ran away: వైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక ప్రజలను నమ్మించి చీటీల పేరుతో రూ. 20 కోట్ల రూపాయలు మోసం చేసి ఉడాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పిల్లల చదువులకు ఇతరత్రా అవసరాలకుని చీటీలు వేసిన జనాన్ని నట్టేటా ముంచిన ఘటనలో బాధితులు లబోదిబోమంటున్నారు. చీటీలే కాకుండా... బాధితులకు అధిక వడ్డీని ఆశ చూపించి లక్ష రూపాయలు తీసుకొని మోసానికి పాల్పడ్డాడు. మోసపోయిన బాధితులంతా... నేడు కడప ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం మాట్లాడిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
డబ్బులు సమయానికి చెల్లించడంతో స్థానికులు ఓబులేసును పూర్తిగా నమ్మినట్లు వెల్లడించారు. తమ నమ్మకాన్ని చీటీల వ్యాపారి ఓబులేసు సొమ్ము చేసుకున్నాడని వాపోతున్నారు. వడ్డీల ఆశచూపించి తమ నుంచి లక్షల రూపాయల మేరకు డబ్బులు తీసుకున్నాడని.. వడ్డీ వస్తుందని ఆశతో డబ్బులు ఇస్తే తమను మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు మొదలుకొని 30 లక్షల రూపాయల మేరకు వడ్డీకి తీసుకున్నాడని... తమ వద్ద సేకరించిన సొమ్ముతో పోరుమామిళ్లలో పలు ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో భార్యాపిల్లలు, బంధువుల పేరిట ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి అతని పేరిట పోరుమామిళ్లలో ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానికంగా అతనికి రాజకీయ నాయకుల పలుకుబడి, పోలీసుల పలుకుబడి ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదనీ.. గత్యంతరం లేక జిల్లా పోలీస్ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
'చిన్న ఓబులేసు తమను నిలువునా మోసం చేశాడు. లక్షల రూపాయల మేరకు వడ్డీకి ఇచ్చాం. ఇంట్లో భార్య, పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి. కొంతమంది స్థానికంగా ఉన్న బడా వ్యక్తులు చిన్న ఓబులేసు ఆస్తులను కాజేయాలని చూస్తున్నారు. చిన్న ఓబులేసు ఆస్తులన్నీ బాధితులకే చెందాలి. పోలీసులు ఆ దిశగా మాకు న్యాయం చేయాలి. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలు తప్పవు. చిన్న ఓబులేసు సుమారు 150 మందికి 15 నుంచి 20 కోట్ల రూపాయల మేరకు డబ్బులు ఇవ్వాలి' -బాధితులు