YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లను ప్రస్తావించారని శాసనమండలి సభ్యులు బీటెక్ రవి తెలిపారు. కానీ శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసి.. మిగిలిన ముగ్గురిని అరెస్టు చేయకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడానికి.. తెరవెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లిన ప్రతిసారి అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకుంటున్నారని అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు కడప పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని పార్టీ నుంచి ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని బీటెక్ రవి ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు చేయకపోవడానికి తెర వెనుక ముఖ్యమంత్రి మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ అధికారులు.. దస్తగిరి చెప్పిన ఆ ముగ్గురిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.