కడప జిల్లా కలసపాడు మండలం కొండ గంగమ్మ తల్లి మైన్స్‌లో శనివారం జిలిటెన్ స్టిక్స్ పేలి 10 నిండు ప్రాణాలు పోయాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు. మామిళ్లపల్లెలో 30.696 హెక్టార్లలో మైనింగ్ నిర్వహించేందుకు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య కస్తూరిభాయికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆయన పదేళ్లపాటు మైనింగ్ చేసుకునేందుకు బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లికి చెందిన చిలకంపల్లి నాగేశ్వరరెడ్డికి జీపీఏ కట్టబెట్టారు. ఈ లీజు అనుమతులు ఈ ఏడాది నవంబరు 1 వరకు ఉన్నాయి. 2019 అక్టోబరు 16, 18 తేదీల్లో అసిస్టెంట్ జియాలజిస్ట్ గనుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు..లోపాలను గుర్తించారు. వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. 2020 ఆగస్టు 25న అధికారుల బృందం మరోసారి అక్కడ తనిఖీలు జరిపి..అంతకు ముందు గుర్తించిన లోపాలేవీ సరిచేయలేదని తేల్చింది. దీంతో గనుల శాఖాధికారులు లీజుదారైన కస్తూరిబాయికి షోకాజ్ నోటీసులిచ్చారు. క్వారీ లీజు రద్దు ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపించారు. అక్రమ తవ్వకాలు, రవాణా వంటివేవీ జరగకుండా చూడాలని కలసపాడు తహసీల్దార్, ఎస్సైకు సూచించారు. వారు కొవిడ్ నియంత్రణ విధుల్లో ఉండడం వల్ల.. నాగేశ్వరరెడ్డి మైనింగ్ కార్యకలాపాల కోసం వేముల నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వానికి నివేదిక