కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలోని రిమ్స్ ఆడిటోరియంలో భారీ చోరీ జరిగింది. సుమారు కోటి రూపాయలు విలువైన వస్తువులు దొంగలించారు. స్విచ్ బోర్డు మొదలుకుని సెంట్రల్ ఏసీ వంటి పెద్ద సామగ్రి సైతం చోరీకి గురైంది. కరోనా సమయం కావటంతో ఏడాదిన్నర కాలం నుంచి ఆడిటోరియంను ఉపయోగించటం లేదు.
జాగిలాలతో పరిశీలన...
భారీ చోరీకి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. జాగిలాలతో పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్విచ్ బోర్డు మొదలుకొని పెద్ద పెద్ద ఏసీ పరికరాలను సైతం దుండగులు దొంగలించారు. రిమ్స్ గురించి తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కరోనా రావడంతో గత ఏడాది నుంచి రిమ్స్ ఆడిటోరియం మూసివేశారు. ఈ ఏడాది మార్చి 9వ తేదీ కార్యక్రమం నిమిత్తం ఆడిటోరియం ఉపయోగించుకున్నారు. అదే రోజు తాళాలు వేశారు. తిరిగి ఈ నెల 9వ తేదీన కొన్ని పరికరాలను ఆడిటోరియంలో పెట్టేందుకు తెరిచారు. ఒక్కసారి అధికారులు ఆడిటోరియం లోపలి భాగాన్ని చూసి అవాక్కయ్యారు. సీలింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న విద్యుత్ తీగలను, స్విచ్ బోర్డ్లను, ఏసీ పరికరాలను, విద్యుత్ మీటర్లను తదితర విద్యుత్ బోర్డు అన్నింటిని అపహరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలిముద్రల నిపుణులతో గుర్తులను సేకరించారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
అక్రమ పదోన్నతిపై విచారణ జరిపించాలి: బీటీఎఫ్ నేతలు