ఫలాల్లో రారాజు... మామిడి. బంగినపల్లి మామిడి కాయలంటే ఇక చెప్పనవసరం లేదు. అంత మధురమైన రుచి వాటి సొంతం. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పండ్ల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ మామిడి, అరటి, బొప్పాయి పంటలు ఎక్కువగా పండిస్తారు. 30 వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో.. మామిడి పూత, పిందె ఆలస్యంగా వచ్చింది. ఈ ప్రభావం దిగుబడులపై పడింది.
మామిడి పూత వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలకు పూత రాలిపోవటంతో దిగుబడులు తగ్గాయి. ఎలాగోలా నిలిచిన దిగుబడులను అమ్మి సొమ్ముచేసుకుందామనుకున్న సమయంలో కరోనా ప్రభావం అడ్డుపడింది. ఇక ఎంతోకొంత వచ్చిన ఫలాన్ని అమ్ముకుందామంటే లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ నిలిచి పోయింది. సరైన సమయంలో మామిడి కాయలు తరలించటానికి వీలు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.