ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న కడప జిల్లా వేంపల్లెకు చెందిన రాజు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్న రాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగడానికి అప్పులు చేసి వాటిని తీర్చడానికి దొంగతనాలు ఎంచుకున్నాడు. రాత్రిపూట ఇళ్ల ముందు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను నకిలీ తాళం చెవితో తీసి ఎత్తుకెళ్లేవాడు. ఈ విధంగా 14 ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. ఈ వాహనాలను కడప జిల్లా వేంపల్లెతో పాటు అనంతపురం జిల్లాలోని ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల్లో చోరీ చేశాడు.
నిందితున్ని అరెస్ట్ చేసి 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అప్పులు తీర్చలేక రాజు దొంగతనాలకు పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు.