వేల ఏళ్లుగా.. అక్కడ పైకప్పు లేకుండానే.. త్రినేత్రుడి దర్శనం! కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం బ్రాహ్మణపల్లె వద్దనున్న మల్లెంకొండేశ్వరుడి కొండకు చేరుకోవాలంటే భక్తులు ఆపసోపాలు పడాల్సిందే. కడప - నెల్లూరు సరిహద్దులో వెలసిన మల్లెంకొండకు చేరాలంటే బ్రాహ్మణపల్లె నుంచి 9 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. మూడు కిలోమీటర్లు సాధారణ నడకే అయినా... ఇక ఆరు కిలోమీటర్లు మొత్తం ఎత్తైన కొండలో నడవాల్సిందే. ఏటా కార్తీకపౌర్ణమికి మల్లెంకొండ ఈశ్వరాలయంలో నెల్లూరుజిల్లా రాజుపాలానికి చెందిన దాత సుబ్బరాజు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
భక్తులెవ్వరికీ హాని కలగదు!
మొదటిసారి మల్లెంకొండకు వెళ్లే.. భక్తులకు చాలా కష్టంగా ఉంటుంది. అలసట వేస్తే కాసేపు సేదదీరి... ఓం నమ:శివాయ అంటూ ముందుకు నడుస్తున్నారు భక్తులు. కొండకు వచ్చే భక్తులు ప్రకృతి రమణీయతను చక్కగా ఆస్వాదిస్తున్నారు. పైకి ఎక్కుతుంటే.. చుట్టూ దట్టమైన కొండలు కనిపిస్తాయి. పెద్దపెద్ద లోయలు, సోమశిల వెనకజలాలతో నిండిన సుందరమైన దృశ్యాలను చూసిన భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఆరు కిలోమీటర్ల నడకదారిలో ఎక్కడా తాగడానికి చుక్క నీరు కనిపించదు. దట్టమైన అడవిలో ఎలుగుబంట్లు, చిరుతలు సంచరిస్తున్నా... ఇప్పటివరకు భక్తులెవ్వరికీ హానీ చెయ్యలేదంటే అదంతా శివుడి కటాక్షమే అంటారు భక్తులు.
పై కప్పు అస్సలు ఉండదు!
కొండపైకి చేరుకోగానే విశాలమైన మైదానంలో చిన్నగా పరమశివుడి ఆలయం కనిపిస్తుంది. ఇదే మల్లెంకొండేశ్వరుడిగా పిలిచే శివాలయం. ఈ ఆలయంలో శివలింగం ఆకృతిలో ఉన్న స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. వేల సంవత్సరాల కిందట ప్రతిష్టించిన శివలింగానికి... కేవలం చుట్టూ గొడలు మాత్రమే ఉంటాయి. పైకప్పు వేయాలని పురాతన కాలంలో కొందరు భక్తులు సంకల్పిస్తే కూలిపోయేదని... లేదంటే అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్రం మీద వచ్చి పైకప్పు కూల్చి వేసేవారని ఇక్కడి పండితులు చెబుతారు. 2012 నుంచి ఏటా కార్తీకపౌర్ణమికి ఇక్కడ మూడు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు, 108 కలశాలతో అభిషేకాలు, శివపార్వతులు, సీతారాముల కల్యాణం, జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఈనెల 10, 11, 12 తేదీల్లో కూడా దాత సుబ్బరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయం సమీపంలోని కోనేరులో గంగాహారతి అద్భుతంగా నిర్వహించారు. మూడురోజుల పాటు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
భక్తులకు కొంగు బంగారంగా ఉన్న మల్లెంకొండేశ్వరుడు... కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల విశ్వాసం. ఎక్కువగా సంతానలేమితో బాధపడే వారు స్వామివారి దర్శన కోసం వస్తున్నట్లు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు వేల మంది భక్తులు స్వామి కొండకు తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
కార్తీకమాసం.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు