స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా.. మహాత్మాగాంధీ ఉమ్మడి కడప జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. జిల్లాలోని పలు పట్టణాల్లో పర్యటించిన గాంధీజీ.. ప్రజలను ఉద్యమం వైపు చైతన్యం చేసేలా అవగాహన సదస్సు నిర్వహించారు. రాజంపేటలో 1921 సెప్టెంబర్ 28న తొలిసారి పర్యటించారు గాంధీజీ. విదేశీ వస్తు బహిష్కరణ చేసి స్వదేశీ ఉద్యమానికి ఊతమివ్వాలని పిలుపునిచ్చారు. ఆ మరుసటి రోజు కడపలో పర్యటించి.. నూకల వెంకటసుబ్బయ్య, భూతపురి నారాయణస్వామికి ఉద్యమ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జాతిపిత ఉద్యమ స్ఫూర్తి, పోరాటాలపై అప్పట్లో సాహితీవేత్తలు కవితాగానం చేశారు.
1929 మే 17న రెండోసారి కడప జిల్లాలో పర్యటించారు గాంధీ. కొండాపురం, మంగపట్నం, ముద్దనూరు ప్రజలతో మమేకమై.. ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు. చిలంకూరులో 940 మంది, నిడుజువ్విలో 500 మందితో గ్రామసభలు నిర్వహించారు. మరుసటి రోజు ప్రొద్దుటూరులో కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. వసంతపేట పురపాలిక ఉన్నత పాఠశాలలో.. బహిరంగసభలో ప్రసంగించారు. కడప పాత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఇంట్లో.. గాంధీజీ రెండు రోజులు బస చేశారు. స్వాతంత్య్ర ఉద్యమానికి తమ వంతు సాయంగా ఆ కుటుంబానికి చెందిన మహిళ.. బంగారు గాజులు విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు. ఆ ఇంటికి హౌస్ ఆఫ్ కడప గాంధీ, శాంతినికేతన్-1929 అనే పేర్లు పెట్టారు. ఇప్పటికీ ఆ పేర్లు చెక్కు చెందకుండా ఆ ఇంటి వారసులు జాగ్రత్తపడుతున్నారు.