Low Water Storage in Reservoirs: ఆగస్టు ముగిసినా వర్షాల జాడ కనిపించలేదు. ఫలితంగా రాయలసీమ రైతాంగానికి.. అటు తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీటి ప్రవాహం కనిపించడం లేదు. శ్రీశైలం నిండితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కర్నూలు, కడపజిల్లాల్లో వరి పంట సాగు చేసే ఆయకట్టుకు నీరందించే పరిస్థితి ఉండేది. కానీ నీళ్లు లేకపోవడంతో కర్నూలు-కడప కాల్వకు నీళ్లు వదలడం లేదు.
ఏటా జులై రెండో వారం లేదా జులై నెలాఖరు నాటికి కేసీ కాల్వకు నీళ్లు వదిలేవారు. దీంతో వరి రైతులు నారుమళ్లు వేసుకుని ఆగస్టు మొదటి వారం నుంచి వరినాట్లకు సిద్ధం అయ్యేవారు. ప్రస్తుతం వర్షాభావం కారణంగా శ్రీశైలం నుంచి నీటి విడుదల ఆగి పోవడంతో.. కేసీ కాల్వ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాల్వకు నీళ్లు వదలుతారనే ఉద్దేశంతో రెండు నెలల నుంచి భూములను దుక్కిదున్ని వరి పంట వేయడానికి సేద్యాలు చేశారు.
జులై మాసంలో నీళ్లు వదలకపోతే.. కనీసం ఆగస్టు నెలలోనైనా కాల్వకు నీళ్లు వస్తాయనే ఆశతో ఎదురు చూసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఆగస్టు నెల ముగిసినా చుక్కనీటి జాడ కాల్వల్లో కనిపించకపోవడంతో వేలాది ఎకరాలు కేసీ ఆయకట్టు బీళ్లుగా దర్శనమిస్తోంది. కడపజిల్లాలోని కేసీ కాల్వలో చుక్క నీరు లేక పోవడంతో వెలవెల బోతోంది. నీటిచెమ్మలేని కేసీ కాల్వ ఎడారిని తలపిస్తోంది. కేసీ కాల్వ కింద రెండు జిల్లాలో దాదాపు 85 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఒక్క కడపజిల్లాలోనే దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అంతా వరి పంట సాగు చేసే పరిస్థితి ఉండేది. ఈసారి నీళ్లు రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కడపజిల్లాలో కేసీ కాల్వ కింద ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, చెన్నూరు, వల్లూరు, సీకేదిన్నె, కడప మండలాల పరిధిలో దాదాపు 35 వేల హెక్టార్లలో వరి పంట సాగయ్యేది. చాపాడు, ఖాజీపేట మండలాలల్లో అత్యధికంగా 20 వేల ఎకరాల చొప్పున వరి పంట సాగయ్యేది. మైదుకూరు మండలంలో 10 వేల ఎకరాల్లో వరి పంట ఏటా సాగు చేసేవారు రైతులు. ఇపుడు కాల్వకు నీరు విడుదల ఆగిపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా దర్శన మిస్తున్నాయి.