కడప జిల్లా ప్రొద్దటూరులో హత్యకు గురైన తెదేపా నేత నందం సబ్బయ్య అంత్యక్రియలు.. ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. అయితే.. తాను చెప్పిన వారి పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేయలేదని.. సుబ్బయ్య భార్య అపరాజిత.. విషయాన్ని లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. హత్య కేసులో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావ బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను నమోదు చేయలేదని చెప్పారు. అపరాజిత చెప్పిన పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ లోకేశ్, తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. సుబ్బయ్య ఇంటి వద్దే బైఠాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ధర్నా కొనసాగింది.
ఈ క్రమంలో పోలీసులు రెండు దఫాలుగా తెదేపా నేతలతో చర్చలు జరిపారు. మొదటిసారి అంగీరించని పోలీసులు... రెండో సారి నిర్వహించిన చర్చల్లో మెట్టు దిగారు. నారా లోకేశ్ పెట్టిన డిమాండ్లకు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారుమునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధపై....కేసులు నమోదు చేయడానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు లోకేశ్ సమక్షంలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డీఎస్పీలు ప్రసాద్, నాగరాజులు....సెక్షన్ 161 ప్రకారం అపరాజిత వాంగ్మూలం నమోదు చేశారు. వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించిన తర్వాత 15 రోజుల్లో కేసులో ముగ్గురి పేర్లు చేరుస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో లోకేశ్ ధర్నా విరమించారు.