Lokesh Face to Face With Handloom workers: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో చేనేత కార్మికులు బాధితులు అని.. కనీసం చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసే తీరిక కూడా ఆయనకు లేదనీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పర్యటిస్తున్న లోకేశ్.. విడిది కేంద్రం వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు.
చేనేత కార్మికులకు బీమా పథకాన్ని రద్దు చేశారని.. నేత కార్మికులకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని లోకేశ్‌కు విన్నవించారు. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని వాపోయారు. లో ఓల్టేజీ కారణంగా ఇబ్బంది పడుతున్నామని.. తమ ఉత్పత్తులకు నాణ్యత తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ సీజన్‌లో ఉపాధి ఉండటం లేదని.. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని లోకేశ్ ముందు సమస్యలు ఏకరవు పెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలపై 5 శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తామన్నారు. చేనేత కార్మికులకు కామన్ వర్కింగ్ షెడ్లు, టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గాల సంఖ్య తగ్గిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: లోకేశ్ "తల్లి, చెల్లిని సీఎం జగన్ రోడ్డు మీదకు గెంటేశారు. తల్లి లాంటి కడప జిల్లాకు కూడా అన్యాయం చేశారు. జగన్ పాలనలో చేనేత కార్మికులు బాధితులే. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కనీసం సమీక్ష చేసే తీరిక కూడా సీఎం జగన్‌కు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఉన్న 5శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తాం. చేనేత కార్మికులకు కామన్ వర్కింగ్ షెడ్లు, టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతాం"-లోకేశ్, టీడీపీ నేత
మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ అందజేస్తాం అని లోకేశ్ భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రైతులు, రంగులు అద్దె కార్మికుల దగ్గర నుంచి మాస్టర్ వీవర్ వరకూ అందరినీ ఆదుకుంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో చేనేత కార్మికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కార్మికులందరూ వీధిన పడే పరిస్థితి తలెత్తిందని లోకేశ్‌తో చేనేత కార్మికులు మొర పెట్టుకున్నారు.