కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో భూ ఆక్రమణ జోరుగా సాగుతోంది. సుమారు వందెకరాల రైతుల భూములు ఇతరుల పేరు మీదకు మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చక్రాయపేట, కల్లూరుపల్లె, శిద్దారాంపల్లె, రాచపల్లె, ఎర్రబొమ్మనపల్లె, మారెళ్లమడక, అద్దాలమర్రి, చిలేకాంపల్లి, సురభి, మహదేవ్ పల్లి, నెర్సుపల్లె, దేవరగుట్టపల్లె గ్రామాల్లో అక్రమాలు జరిగాయని బాధితులు వాపోతున్నారు.
పట్టాదారు పాసుపుస్తకాలు కావాలంటే మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని తహసీల్దార్ పరిశీలించి లబ్ధిదారుకు పట్టాదారు పాసు పుస్తకం అందజేస్తారు. కానీ చక్రాయపేటలో ఇవేమీ జరగ లేదు. ఎలాంటి దరఖాస్తు లేకుండానే కంప్యూటర్లో రైతుల పేర్లు మారిపోయాయి. ఇష్టారాజ్యంగా పట్టాదారు పాసు పుస్తకాలు పుట్టుకొచ్చాయి. విషయం రైతులకు తెలియటంతో రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ భూములు తమకిప్పించాలని వేడుకుంటున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.