కడప జిల్లా వాసులు కృష్ణవేణిపైనే ఆశలు పెట్టుకొన్నారు. జిల్లాలో 15 జలాశయాలను నిర్మించారు. చిన్న, మధ్యతరహా, భారీనీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. నాలుగు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది జూన్ ఆరంభం నుంచి ఈనెల 10వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 204 మి.మీ. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 309.5 మి.మీ నమోదైంది. సాధారణం కంటే 51.7 శాతం అధికంగా కురిసింది. ఈ సీజన్లో వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 1,08,612 హెక్టార్లు. ఇప్పటికే 35 వేల హెక్టార్లలో సాగయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం, తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకాల ఆధారంగా సింహ భాగం ప్రాజెక్టులు ఉన్నాయి. పెన్నానది, చిత్రావతి, పాపఘ్ని, బాహుదా, సగిలేరు, పింఛ నదులున్నాయి. వీటిల్లో కుముద్విని, పినాకినిలో మోస్తరుగా నీరు ప్రవహిస్తోంది. మిగతా చోట్ల జల ప్రవాహం జాడలు కనిపించలేదు.
గండికోటకు నీరు చేరితే..
శ్రీశైలం జలాశయం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 107 టీఎంసీల నీరు ఉంది. కృష్ణానదిలో వరద ప్రవాహం జోరు కొనసాగుతోంది. 1.80 లక్షల క్యూసెక్కుల జలాలు చేరుతున్నాయి. శ్రీశైలం నుంచి 38 టీఎంసీల మిగులు జలాలను తీసుకొచ్చేందుకు శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు నీటి నియంత్రణ కేంద్రం నుంచి ఎస్ఆర్ఎంసీ ప్రధాన కాలువ 16.805 కి.మీ దూరం ఉంది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి గోరకల్లు జలాశయం వరకు 56.775 కి.మీ నీరు ప్రవహించాలి. అక్కడి నుంచి అవుకు జలాశయం వరకు 57.700 కి.మీ రావాలి. అవుకు నుంచి మన జిల్లాలోని లింగాపురంతండా వరకు వరద కాలువ 52.875 కి.మీ ఉంది. సొరంగం ఐదు కి.మీ పైగా ఉంది. సొరంగం దాటిన తర్వాత సుమారు ఒకటిన్నర కి.మీ ప్రవహిస్తే గండికోటకు నీరు చేరుతుంది. కృష్ణమ్మ వస్తే అన్నదాతల ఆశలు పండినట్లే. తాగు, సాగునీటి వెతలు తీరనున్నాయి.
ప్రస్తుతం నిల్వ
గండికోట జలాశయం నిల్వ సామర్థ్యం 28.850 టీఎంసీలు. ప్రస్తుతం 4.045 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, పైడిపాళెం, జీకే-సీబీఆర్కు నీరు తరలించాల్సి ఉంది. ప్రస్తుతం గండికోట ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోసేందుకు(పంపింగ్) తగినంత నీరు లేదు. 4.50 టీఎంసీలకు పైగా ఉంటేనే ఎత్తిపోయవచ్ఛు పైడిపాళెంలో ఆరు టీఎంసీలు నిల్వ చేసే వీలుంది. కాకపోతే ఇక్కడ 1.445 టీఎంసీల జలాలు ఉన్నాయి.
గంగతో తీరాలి బెంగ