ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటిలో భార లోహాలు... కిడ్నీలకు కీడు.. - కడప తాజా సమాచారం

ఇటీవల కడప జిల్లాలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో డయాలసిస్‌ కేంద్రాలు పరిమితంగానే ఉంటూ.. అధికార యంత్రాంగం నివారణపై దృష్టి సారించని వైనం నెలకొంది. దీంతో బాధితులు తీవ్రంగా కలవరపడుతున్నారు.

Kidney problems with drinking contaminated water in Kadapa district
'బద్వేలులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం'

By

Published : Jan 3, 2021, 6:13 PM IST

మానవ శరీరంలో వ్యర్థ పదార్థాలు విడుదలవుతుంటాయి. రక్తంలో కలిసిన వీటిని మూత్రపిండాలు (కిడ్నీలు) జల్లెడ పట్టి మూత్రం (యూరిన్‌) రూపంలో బయటకు పంపిస్తాయి. శరీరంలో ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంటుంది. మూత్రపిండాలు దెబ్బతింటే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా ప్రాణాపాయం బారిన పడతారు. ఒకవేళ మూత్రపిండాలు పూర్తిగా చెడిపోతే డయాలసిస్‌ ప్రక్రియ ద్వారా రక్తశుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇటీవల జిల్లాలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతున్న అంశం.

'బద్వేలులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం'

మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే డయాలసిస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి ఎన్ని సార్లు చేసుకోవాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. వైద్యుల సూచన మేరకు కొంతమంది రోగులకు కిడ్నీ మార్పిడి కూడా చేస్తుంటారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని సర్వజన ఆసుపత్రి, ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి, పులివెందులలోని ప్రాంతీయాసుపత్రిలో ‘నెఫ్రో ప్లస్‌’ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తుండగా.. రాయచోటిలోని ప్రాంతీయాసుపత్రిలో నూతనంగా అపోలో సంస్థ సేవలకు శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు.

'బద్వేలులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం'

ప్రత్యేక విభాగం లేదు..

జిల్లాలో కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందడంలేదు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇప్పటివరకు నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఇక్కడ డయాలసిస్‌ మాత్రమే చేస్తున్నారు. కేవలం ఒక నెఫ్రాలజిస్టును తాత్కాలిక పద్ధతిలో నియమించారు.

తాగునీటిలో భారీ లోహాల కారణంతోనే..

కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేసే తాగునీటిని సక్రమంగా శుద్ధి చేయకపోవడంతో కిడ్నీలపై ప్రభావం పడుతోంది. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేంపల్లె మండలాల పరిధిలో సరఫరా చేసే తాగునీటిలో సిలికాన్‌, ఫ్లోరైడ్‌, లెడ్‌, అల్యూమినియం లాంటి భారీ లోహాలు (హెవీ మెటల్స్‌) అవశేషాలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు చాలా లోతులో లభిస్తుండగా.. వాటిని నేరుగా వినియోగిస్తుండడంతో కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు పట్టణంలో రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలామందికి కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం చాలామంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారు. అక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. జిల్లాలో డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగుల్లో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చినవారే అధికంగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

బద్వేలు నుంచి కడపకు రావాల్సిందే..

గతంలో కడప, ప్రొద్దుటూరులోనే డయాలసిస్‌ కేంద్రాలు ఉండేవి. 2019లో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 85 మంది రోగులు డయాలసిస్‌ కోసం వచ్చేవారు. 2019లో తెదేపా ప్రభుత్వ హయాంలో రాయచోటిలో కొత్తగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు కావడంతో కడపకు వచ్చే రోగుల సంఖ్య కొంతమేర తగ్గింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన 2020లో పులివెందులలోనూ ఈ సౌకర్యం కల్పించారు. గత ఏడాది ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి డయాలసిస్‌కు 61 మంది రోగులొచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా బద్వేలు నియోజకవర్గానికి చెందిన రోగులు డయాలసిస్‌ కోసం గంటల తరబడి ప్రయాణించి కడప నగరానికి వస్తున్నారు. నెలకు రవాణా ఖర్చులకే రూ.వేలు చెల్లించలేక బాధితులు సతమతమవుతున్నారు. బద్వేలులో కొత్తగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.

నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉండాలి..

నా భార్యకు ఏడాది కిందట కిడ్నీ సమస్య వచ్చింది. డయాలసిస్‌కు కడపకు తీసుకువస్తున్నాను. ఒక వైద్యుడు అప్పుడప్పుడు వస్తుంటారు. నిరంతరం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి.

- చిన్నపుల్లయ్య, చాపాడు మండలం, ఓబులరెడ్డిపేట

చలిలో ప్రయాణించలేకపోతున్నాను..

నేను ఆరేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. ప్రతి రెండురోజులకొకసారి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తున్నాను. చలిలో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. బద్వేలులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి.

- నరసింహారెడ్డి, బ్రాహ్మణపల్లె, గోపవరం మండలం

'బద్వేలులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి'

మా గ్రామంలో 30 మంది కిడ్నీ రోగులు ఉన్నారు. వాళ్లు డయాలసిస్‌ చేయించుకునేందుకు కడప నగరానికి రావాల్సి వస్తోంది. బద్వేలులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే సౌకర్య వంతంగా ఉంటుంది.

- గౌస్‌పీర్‌, పోరుమామిళ్ల

రక్తపోటు, మధుమేహ బాధితులకు ముప్పు ఎక్కువ..

జిల్లాలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రక్తపోటు, మధుమేహ బాధితులకు ముప్పు అధికంగా ఉంటుంది. ఇటువంటివారు ప్రతిరోజు కనీసం అరగంటపాటు వ్యాయామం చేస్తే నివారించుకునే అవకాశం ఉంటుంది. మద్యపానం, ధూమపానం తగ్గించుకోవాలి. వైద్యుల సూచనలతో పోషకాహారం తీసుకోవాలి.

- సురేశ్వర్‌రెడ్డి, వైద్యుడు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కడప

వైద్యనిపుణుడిని సంప్రదించడం మంచిది..

గతంలో కిడ్నీ సమస్యలపై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. నాటుమందులు వాడి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునేవారు. ఇటీవల ప్రజల్లో చైతన్యం పెరగడంతో ముందుగానే సమస్యలు బయటపడు తున్నాయి. జిల్లాలో కిడ్నీ రోగులు పెరగడానికి ఇదీ ఒక కారణం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యనిపుణుడిని సంప్రదించడం మంచిది.

- సతీష్‌రెడ్డి, కిడ్నీవ్యాధి వైద్యనిపుణుడు, కడప

బద్వేలులో కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించాం..

కరోనా నేపథ్యంలో కిడ్నీ రోగులు డయాలసిస్‌కు ప్రభుత్వాసుపత్రులకు రాలేకపోయారు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో తిరిగి డయాలసిస్‌ కేంద్రాలకు పెద్దసంఖ్యలో రోగులొస్తున్నారు. బద్వేలులో కొత్తగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

- శ్రీధర్‌, డీసీహెచ్‌ఎస్‌, కడప

ఇదీ చదవండి:

పులివెందులలో 'జగనన్న మహిళా మార్ట్' ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details