ys Viveka murder case : కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకాను హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. ‘వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకో. మరో ఇద్దరు, ముగ్గురితో కలిసి నువ్వే హత్య చేసినట్లు సిట్ అధికారుల ఎదుట అంగీకరించు. వై.ఎస్.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకా హత్యకు ప్రణాళిక వేసి, కొత్తవాళ్లతో ఆయన్ను హత్య చేయించా. హత్య చేసినవారిని పోలీసులు విచారిస్తే... వారు అసలు విషయం చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. వారు నిజం చెప్పేస్తే నేను, మిగతా వారు ఇబ్బందుల్లో పడతాం’ అంటూ శివశంకర్‌రెడ్డి వాపోయారని గంగాధర్‌రెడ్డి వివరించారు. పులివెందుల వాసి అయిన గంగాధర్‌రెడ్డి 2012 నుంచి యాడికిలో ఉంటున్నారు. కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉండేవారు. గతేడాది అక్టోబరు 2న సీబీఐ అధికారులు ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ‘వివేకా హత్యానేరాన్ని నీపై వేసుకుంటే నీ జీవితాన్ని సెటిల్ చేస్తా. పోలీసుల సంగతి నేను చూసుకుంటా. కొంతకాలం తర్వాత నువ్వు బయటకొచ్చేయొచ్చు’ అని కూడా శివశంకర్‌రెడ్డి చెప్పారని గంగాధర్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సొంత బాబాయ్ హత్య విషయమని.. తేడా వస్తే తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని తాను తిరస్కరించానని ఆయన వాంగ్మూలంలో వివరించారు. గంగాధర్‌రెడ్డి వాంగ్మూలంలోని ఇతర ప్రధానాంశాలివే..
అవినాష్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల ప్రమేయం ఉంటుందనుకున్నా..
వివేకా గుండెపోటుతో చనిపోయారని 2019 మార్చి 15న టీవీల్లో చూసి, ఇతర స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు ఘటనాస్థలంలో రక్తపుమడుగు శుభ్రం చేస్తున్నారని తెలిసిన తర్వాత.. హత్య వెనుక వీరి ప్రమేయమే ఉంటుందని అనుకున్నా. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల గురించి నాకు బాగా తెలుసు. వారి ప్రణాళిక లేకుండా వివేకాను హత్యచేసే ధైర్యం ఎవరికీ ఉండదు. అందుకే వారు బెడ్రూం, బాత్రూంలలో రక్తపు మడుగును శుభ్రం చేయించి ఆధారాలు ధ్వంసం చేశారు. వారి ప్రమేయం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసేవారు.
వివేకాను అంతం చేయాలనుకున్నారు
కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబానికి వై.ఎస్.వివేకానందరెడ్డితో తీవ్ర శత్రుత్వం ఉంది. వివేకా అనుచరులు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబాన్ని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సరిగా పట్టించుకునేవారు కాదు. అందుకే వారంతా వివేకాను అంతం చేయాలనుకునేవారు. రాజకీయాల్లో ఉనికి కోసం ఇదంతా చేసేవారు. వివేకానందరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి... అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు ఎన్నడూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులకు పోటీచేసే అవకాశం ఇవ్వలేదు.