ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కబ్జాల ఘనాపాటి 'ఆకేపాటి' .. వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాహా..! - Akepati Amarnath Reddy Encroached govt Lands

Akepati Amarnath Reddy Encroached Lands: ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి భూ ఆక్రమణలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అమరనాథ్​రెడ్డి, ఆయన కుటుంబీకుల పేరుతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆకేపాటిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.

akepati amarnath
ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
author img

By

Published : Jan 11, 2023, 7:38 AM IST

Akepati Amarnath Reddy Encroached Lands: ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఆయన కుటుంబీకుల పేరుతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నట్లు రెవెన్యూశాఖ అంచనాకు వచ్చింది. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి సుమారు 200 ఎకరాలను ఆయన అధికారికంగా బదలాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యవహారం బయటకు పొక్కడంతో కొన్నింటిని ఆన్‌లైన్‌నుంచి తొలగించినట్లు సమాచారం.

ఆకేపాటి భూదందాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ యంత్రాంగం అంతర్గతంగా విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూములను ఆకేపాటికి కట్టబెట్టడంలో లోగడ ఇక్కడ పనిచేసిన అన్నమయ్య జిల్లా రాజంపేట తహసీల్దారు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీనిపై విజిలెన్స్‌ విచారించింది. రాజంపేట మండలం మందపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన 739 సర్వేనంబరులో 4,389.27 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో కొంత ఆకేపాటి కుటుంబీకుల పేరిట డీకేటీ పట్టాలతో నమోదైందని సమాచారం.

భూమి సబ్‌డివిజన్‌, స్క్రూటినీ చేయకుండా ఆన్‌లైన్‌లో చేర్చి డిజిటల్‌ సంతకాలతో అడంగల్‌, 1బి, పాసుపుస్తకాలను లోగడ పొందినట్లు గుర్తించారు. ఆకేపాటి కుటుంబ పరివారంతోపాటు బినామీ పేర్లతోనూ ఇక్కడ రెవెన్యూ రికార్డులు పొందినట్లు తేలింది. మైనర్ల పేరిటా భూములను రికార్డుకు ఎక్కించారని సమాచారం. మందపల్లి గ్రామంలో 553 సర్వేనంబరులో 1,905.60 ఎకరాలు ఉండగా.. అందులో కొంత సబ్‌డివిజన్‌ చేసుకుని ఆక్రమించుకున్నట్లు రెవెన్యూశాఖ గుర్తించింది.

in article image
పేదల పట్టా భూముల్లో కట్టారని ఆరోపణలున్న ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పాఠశాల ఆవరణ

కుటుంబసభ్యుల పేర్లు గుర్తింపు:అసైన్‌మెంటు కమిటీతో సంబంధం లేకుండా 110 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లో డీకేటీ పట్టాల పేరిట ఆన్‌లైన్‌ చేసుకున్నట్లు రెవెన్యూవారు గుర్తించారని తెలుస్తోంది. వీరిలో ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆకేపాటి జ్యోతమ్మ, ఆకేపాటి సుజన, ఆకేపాటి అనసూయమ్మ, ఆకేపాటి సాయి అఖిల్‌రెడ్డి, ఆకేపాటి సాయి అనురాగ్‌రెడ్డి, ఆకేపాటి సాయి భరత్‌, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి పేరిట భూములున్నాయి. ఈ జాబితాలో బినామీల పేర్లూ వెలుగుచూశాయి. వీరి పేరిట దఫాలుగా డీకేటీ పట్టాలు పొందినట్లు రెవెన్యూశాఖ గుర్తించింది.

ఆకేపాడు రెవెన్యూ గ్రామంలో సర్వేనంబరు 1,041లో 6,516.62 ఎకరాలున్న ప్రభుత్వ భూముల్లోనూ కొంత ఆకేపాటి కుటుంబీకుల ఆధీనంలో ఉందనే ఆరోపణలున్నాయి. ఇక్కడ సాగు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆకేపాటి గ్రామంలో ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పేరుతో ఒక పాఠశాలను నిర్మించారు. ఆ భూమి పేదలకిచ్చిన ఇళ్ల పట్టాల స్థలమేనని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ పట్టాలుపొందిన 70 మంది పేదలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అన్నమయ్య కాలువ సమీపంలో వంద ఎకరాల వరకు మరొకరి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించి విచారిస్తున్నారు.

ఆక్రమిత భూములకు పదుల సంఖ్యలో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులను ఎస్పీడీసీఎల్‌ సమకూర్చినట్లు వెలుగులోకి వచ్చింది. కబ్జాలకు పాల్పడుతున్న ఆకేపాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని వైసీపీలోని మరో వర్గం నేతలు పట్టుబడుతున్నారు. వారు ఈ మేరకు మంగళవారం రెవెన్యూ ఉన్నతాధికారులను కలిశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details