ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఉక్కు పరిశ్రమ.. మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం - kadapa steel plant planning details

కడప జిల్లా జమ్మలమడుగులో చేపడుతోన్న ఉక్కు పరిశ్రమను పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలు ముందుకు వస్తే అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పలు బహుళ జాతి సంస్థలతో చర్చలు జరుపుతున్నామని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అన్నారు.

కడపలో ఉక్కు పరిశ్రమ.. మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం
కడపలో ఉక్కు పరిశ్రమ.. మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం

By

Published : Dec 24, 2019, 4:29 AM IST

ఉక్కు పరిశ్రమ మూడేళ్లలో పూర్తి చేస్తామన్న పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె - పెద్దదండ్లూరు గ్రామాల వద్ద ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో నిర్మిస్తున్న ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ పరిశ్రమ మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రకటన చేయగా... ఆ దిశగా అడుగులు వేసేందుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

రూ.250 కోట్లు కేటాయింపు

ఉక్కు పరిశ్రమకు ఇప్పటికే బడ్జెట్​లో రూ.250 కోట్లు కేటాయించారు. కాగా వచ్చే బడ్జెట్​లో రూ.2,500 కోట్లు, మరో బడ్జెట్​లో రూ.2,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. బ్యాంకుల వద్ద రూ.10 వేల కోట్లు రుణం తీసుకుని.. మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఎగుమతికి ప్రాధాన్యం

అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమకు అవసరమైన హైగ్రేడ్ స్టీల్​ను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అదే ఇక్కడ నాణ్యమైన హైగ్రేడ్ స్టీల్ ఉత్పత్తి అయితే... పొరుగు జిల్లా పరిశ్రమలకు సరఫరా చేయవచ్చని రజత్ భార్గవ్ తెలిపారు. ప్రముఖ బహుళ జాతి సంస్థలు ముందుకు వస్తే వాటికే ఉక్కు పరిశ్రమ బాధ్యతలు అప్పగిస్తామని.. ఎవరూ ఆసక్తి చూపని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి సాంకేతికతో నాణ్యమైన ఉక్కు తయారు చేయాలనే అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి

ఉక్కు పరిశ్రమ పనులు ఇవాళ్టి నుంచే ప్రారంభించాలని కడప కలెక్టర్​కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయని రజత్​ భార్గవ్​ తెలిపారు. ముందుగా ఇక్కడ మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి సారిస్తామని ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ మధుసూదన్ తెలిపారు. ఇప్పటికే పరిశ్రమకు అవసరమైన నీరు, ఇనుప ఖనిజం, భూమి కేటాయింపులు జరిగాయన్నారు. ఉక్కు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలంటే... చుట్టు పక్కల అనుబంధ పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మరిన్ని పరిశ్రమలు రాయలసీమ జిల్లాల్లో నెలకొల్పాలనే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details